Oct 15,2023 00:28

పాదయాత్ర బృ:దానికి సమస్యలు చెబుతున్న ప్రజలు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : వర్షభావ పరిస్థితులు, సాగర్‌ కుడి కాల్వకు సాగునీరు వదలక పోవడంతో సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ కార్మికులకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని,ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. సిపిఎం చేపట్టిన 'ప్రజారక్షణ భేరి' పాదయాత్ర సత్తెనపల్లి పట్టణంలో రెండోరోజైన శనివారమూ కొనసాగింది. శాస్త్రినగర్‌, చెంచు కాలనీ, వీరాంజనేయ నగర్‌, రాజుల కాలనీ, పాత బస్టాండు, పార్కు రోడ్డు, బోయ కాలనీలలోలో పాదయాత్ర పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్తు మీటరు రీడింగు ప్రతి నెలా ఆలస్యంగా తీస్తున్నారని, దీంతో తమకు 200 యూనిట్లు దాటి బిల్లు వస్తుందని, తమకు ఉచిత విద్యుత్‌ వర్తించడం లేదని శాస్త్రి నగర్‌, చెంచు కాలనీ ప్రజలు వాపోయారు. ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవాలంటే ఇసుక ధర విపరీతంగా పెరిగిందని, గతంలో ట్రక్‌ రూ.రెండు వేలుంటే ఇప్పుడు రూ.ఏడు వేలుందని మరికొందరు ఆవేదనకు వ్యక్తం చేశారు. పొలాలకు నీరివ్వకపోవడంతో తమకు వ్యవసాయ పనుల్లేకుండా పోయాయని, కుటుంబ జీవనం కష్టమైందని కూలీలు ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయంలో ఇదే పరిస్థితులు కొనసాగితే రైతులతోపాటు కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడతారని, సమస్య మరింత జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటికే ఉపాధి కరువై ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వాలు పన్నులు, ధరల భారాలు మోపుతోందని,ఈ విధానాలను తిప్పికొట్టేందుకు సిపిఎం చేపట్టే పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు కె.శివదుర్గారావు, ఎ.వెంకటనారాయణ, ఎం.హరిపోతురాజు, కార్తీక్‌, ఇట్లాస్‌, ఎ.వీరబ్రహ్మం, ఆర్‌.పురుషోత్తం, పి.రామారావు, ఎం.జ్యోతి పాల్గొన్నారు.
రూరల్‌ గ్రామాల్లో రేపటి నుండి పాదయాత్ర
మండలంలోని గ్రామాల్లో సిపిఎం పాదయాత్ర సోమవారం నుండి జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌ తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు లక్కరాజుగార్లపాడులో పాదయాత్రను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌, కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొనాలని, సమస్యలను సిపిఎం బృందం దృష్టికి తేవాలని కోరారు.