Nov 18,2023 22:40

ప్రజాశక్తి-అమలాపురం అల్లవరం మండలంలో పంటలు ముంపు బారిన పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. శనివారం అల్లవరం మండలం కోడూరుపాడులో 1.8 కిలోమీటర్‌ వద్ద రూ.40 లక్షల వ్యయంతో డ్రైన్‌పై సైఫన్‌ తొలగింపునకు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పల్లిపాలెం వద్ద లోయర్‌ కౌశిక్‌ మేజర్‌ లింక్‌ డ్రైన్‌ జీరో కిలోమీటర్ల వద్ద డ్రెడ్జింగ్‌ పనులకు రూ.87 లక్షలతో భూమి పూజ చేశారు. ఈ డ్రెడ్జింగ్‌ పని వల్ల సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టు లోని పంట ముంపు బారి నుంచి రక్షింప బడుతుందన్నారు. ఈ రెండు పనులకు రూ.1.27 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయిం చిందన్నారు. అయినవిల్లి, అమలాపురం, అల్లవరం మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు ముంపు బారి నుంచి రక్షింపబడతాయన్నారు ఈ రెండు పనులు పూర్తయితే ఆయకట్టు రైతాంగానికి చాలా వరకు ముంపు బెడద తప్పుతుందన్నారు. ఖరీఫ్‌లో పంటలకు ముంపు బెడద శాశ్వతంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మండల పరిధిలో రూ.1.85 కోట్ల మేర పూడికతీత పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇవి కూడా పూర్తయితే శాశ్వతంగా ముంపు బెడద నివారించ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇలు జి.శ్రీనివాసరావు. కె.ఏడుకొండలు, డిఇ ఎంవివి.కిషోర్‌, కె.సునీతాదేవి, జిన్నూరి రామారావు, ఎంపిపి ఇళ్ల శేషారావు, జెడ్‌పిటిసి కొనుకు గౌతమీ, సర్పంచ్‌ నడింపల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.