కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు
పొగాకు వాడకం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన ఎన్‌టిసిపి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆన్ ఐఎల్‌ఎల్‌ఎల్‌ఐసిఐటి ట్రేడ్ ఆఫ్ టుబాకో ఓరియంటేషన్ లైన్ డిపార్ట్‌మెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కోత్ప-2003 చట్టాలను సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. పొగాకు వాడకం ద్వారా వచ్చే భయంకరమైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడానికి అధికారులు జిల్లా, మండలస్ధాయి కమిటీల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పబ్లిక్ స్థలాల్లో సిగరెట్ కాల్చడం చట్టప్రకారం నిషేధించామని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ స్థలాల్లో పొగ తాగిన వారికి రూ.200 వరకు పెనాల్టీ వసూలు చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని, వీటిని కఠినంగా అమలు చేయాలని చెప్పారు. ప్రతి కళాశాల, స్కూళ్లకు 100 గజాల పరిధిలో పొగాకు అమ్మే షాపులు ఉండరాదన్నారు. జిల్లాకు సంబంధించి జంగారెడ్డిగూడెంలో టుబాకో ఉత్పత్తులు తయారుచేసే కేంద్రం ఉందని, వీటిలో పనిచేసే వారు వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు నిర్వహించి పరీక్షలు చేయించాలని, సచివాలయాల మహిళా పోలీసులు పొగాకు నియంత్రణపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీ పరిధిలోను, మండలాల పరిధిలోను ప్రతినెలా పొగాకు నియంత్రణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశానికి ముందు ఎన్‌టిసిపి స్టేట్ లీగల్ కన్సల్టెంట్ పుట్టి శివ, పొగాకు నియంత్రణకు సంబంధించిన కోత్ప -2003 చట్టాలను గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా ఎఎస్‌పి చక్రవర్తి, ఎన్‌సిడిపిఆర్‌బిఎస్‌కె ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్.మానస, జెడ్‌పి సిఇఒ రవిబాబు, డిఇఒ గంగాభవాని, వ్యవసాయ శాఖ శాఖ జెడి రామకృష్ణ, మెడికల్ అండ్ హెల్త్ డిఐఒ నాగేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకటరమణ, ఎక్సైజ్ ఇఎస్‌ఐ పి.రాధాకృష్ణ, కమర్షియల్ ట్యాక్స్ ఎసి ఎన్.జగదీశ్వరయ్య, సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
పదో తేదీ వరకూ క్రీడాకారుల ఎంపిక
సిఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్లో భాగంగా జిల్లాలో శాసనసభ నియోజకవర్గాలస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్న క్రీడా సంబరాలు లోగోను, గోడిపతులను ఆయన శుక్రవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ క్రీడా విభాగాల్లో క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయన్నారు. ఈ నెల 4న బుట్టాయగూడెం మండలం ములగలంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లోను, ఈ నెల 6న ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియంలోను, చింతలపూడి మండలం ప్రగడవరం జెడ్‌పి హైస్కూల్‌లోను, 8న నూజివీడు డిఎఆర్ కళాశాల, దెందులూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లోను, 9న కైకలూరులోని వైవిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోనూ, 10న గణపవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోను ఎంపికలు జరుగుతాయని అన్నారు. క్రీడాకారుల ఎంపికలో పాల్గొనదలచినవారు విలేజ్ జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లో తమ పేరు నమోదు చేసుకుని ఉండాలన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు, జిల్లాలో ప్రథమ స్థానం పొందిన క్రీడాకారులు, జట్లను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరచిన వారిని ఎంపిక చేసి జిల్లా పేరు ప్రతిష్టలను నిలిపేలా శిక్షణ ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సెట్‌వెల్ సిఇఒ ఎమ్‌డి.మెహర్రాజ్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వినాయక ప్రసాద్, చీఫ్ కోచ్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










