
ప్రజాశక్తి-టంగుటూరు : సొంత బ్యారన్ కలిగిన రైతులు పొగాకు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిధిలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో పొగాకు పంట నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2023-24 పంట కాలానికి సంబంధించిన నిబంధనలను రైతులకు వివరించారు. పంట నియంత్రణ ఆవశ్యకతను పాటించాలన్నారు. నల్ల రేగడి నేలలు కలిగిన రైతులు శనగ, మినుము, కంది, మొక్కజొన్న, మిరప, ధనియాలు, పెసర వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం మంచిదన్నారు. పచ్చిరొట్ట ఎరువులను పంటలకు వినియోగించాలన్నారు. పొగాకు పంట చుట్టూ ఎర పంటలైన ఆముదం, బంతి అవరోధ పంటలైన జొన్న, మొక్కజొన్న సాగు చేయడం ద్వారా చీడపీడల ఉధతని కొంతమేర నివారించవచ్చని తెలిపారు. పొగాకు రైతుల బ్యారన్ల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. సాధారణ రుసుంతో నవంబర్ 9 వరకూ బ్యారన్ల రిజిస్ట్రేషన్‌కు సమయం ఉందన్నారు. నవంబర్ 10 నుంచి 23 వరకూ రూ. 100 రుసుం, నవంబర్ 24 ఉనుంచి డిసెంబర్ 4 వరకూ రూ.400 అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మొక్కలను బోర్డు అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఎస్‌జిఒ జి.సిద్ధరాజు, పిఎస్‌ఎస్, ఐటిసి, జిపిఐ, ఎస్‌ఎఫ్‌ఎకంపెనీల ప్రతినిధులు రామాంజనేయులు, వెంకట్రావు, శ్రీనివాసులు, ప్రసాద్, తూర్పు నాయుడుపాలెం, మల్లవరప్పాడు, శివపురం గ్రామాల రైతులు, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.