May 31,2023 23:53

మానవహారం చేపడుతున్న వైద్య అధికారులు, సిబ్బంది

ప్రజాశక్తి-పాడేరు: వరల్డ్‌ నో టొబాకో డే ను పాడేరులో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సి జమాల్‌ బాషా ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ పీఓ డాక్టర్‌ భారతీ కుమారి దేవి హాజరయ్యారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తూ, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాత బస్టాండ్‌ వద్ద మానవ హారం నిర్వహించి పొగాకు వినియోగం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్‌ అడిక్షన్‌ సెంటర్‌ వైద్యాధికారులు మాట్లాడుతూ, పొగాకు వాడటంతో కలిగే దుష్ప్రభావాలను వివరించారు.పొగాకు ఉత్పత్తుల వాడకమునకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఏ.ఎస్‌.ఆర్‌ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని గణనీయంగా తగ్గించడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కృషి చేయాలన్నారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ కృష్ణారావు, డిప్యూటీ డెమో రవి, వైద్యాధికారులు, డ్రగ్‌ అడిక్షన్‌ సెంటర్‌ సిబ్బంది, పాడేరు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినీలు, ఆశా వర్కర్లు కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, నైస్‌ ఫౌండేషన్‌ స్టాఫ్‌, డిస్ట్రిక్ట్‌ ఎన్‌టిపిసి సోషల్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు.