
ప్రజాశక్తి-పొదిలి: పొదిలి పట్టణానికి మంచినీరు అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ఆరు నెలలుగా సాగర్ నీరు సక్రమంగా రాక, వాడుక నీరు లేక, బబుల్ నీటితో అనారోగ్యం బారిన పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. గత ఏడాది కురిసిన కొద్దిపాటి వర్షాలకు పట్టణంలోనీ బుగ్గచలం డీప్ బోర్లతో సహా ఇళ్లలోని బోరుబావులు నీటితో కళకళలాడాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు పడకపోవడంతో నిన్నమొన్నటి దాకా నీరు అందించిన గృహాలలోని బోర్లు ఒక్కొక్కటిగా ఒట్టిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గత ఆరు నెలలకు పైగా ట్యాంకర్లు నిలిచిపోవడంతో ప్రస్తుతం నీటి ఎద్దడి పొదిలి ప్రజలను తరుముతోంది. ఇదే సమయంలో గత ఆరు నెలల కాలంలో పట్టణ దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్టు(ఎన్‌ఏపి) పథకం గాడితప్పింది. ఈ పథకం కింద దర్శిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ద్వారా పొదిలి పట్టణంతో పాటు కొన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తున్నారు. పట్టణానికి అతి ముఖ్యమైన ఈ పథకం నిర్వహణా లోపంతో భ్రష్టు పట్టిపోయింది. పొదిలితో పాటు దర్శి మండలంలోని పలుగ్రామాలకు మంచినీరు అందించేందుకు ఉద్దేశించిన ఎస్‌ఎస్ ట్యాంకు నిర్వహణ, ఫిల్టర్ బెడ్ల మార్పు లేకపోవడం, ఇతర లోపాలు ప్రజలకు శాపంగా మారాయి. ఆరు నెలలకు ముందు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పట్టణ ప్రజలకు సాగర్ నీరు అందించే పద్ధతి ఉండగా ఈ ఏడాది మండు వేసవిలో సైతం 10-15 రోజులకు నీటిని ఇచ్చారు. దీంతో కడుపు మండుతున్న పట్టణ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా శుక్రవారం పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీ మహిళలు సాగర్ మంచి నీటి సమస్యపై ఖాళీ బిందెలతో కాలనీలో ప్రదర్శన చేశారు. గతంలో వీరు రెండు దఫాలుగా ఒంగోలు-పొదిలి రహదారిపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బెస్తపాలెం, పిఎన్‌ఆర్ కాలనీ వాసులు రెండు దఫాలు, విశ్వనాథపురం ఇస్లాంపేట వారు ఒకసారి రాస్తారోకో, మరోసారి ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఇళ్లవద్దకు వస్తున్న శాసనసభ్యులు గాని, నాయకులు గాని మంచినీటి ఎద్దడిపై అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక శివారు కాలనీలు, గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగర పంచాయతీ పరిధిలోని మాదిరెడ్డిపాలెం, కాటూరివారిపాలెం, బుచ్చనపాలెం, కొత్తపాలెం గ్రామాలలో నీరు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని దుస్థితి. ఈ గ్రామాల ప్రజలు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా శివాలయం ఎన్‌ఏపి సంప్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్యాంకు నుంచి నీటిని తీసుకువెళుతున్నారు. అప్పడప్పుడూ కొత్తూరు కెనరా బ్యాంకు వద్ద ప్రధాన రహదారిపై వచ్చే కుళాయి వద్ద సాగర్ మంచినీటి కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల పెద్ద చెరువుకు సాగర్ నీరు మళ్లింపు పథకానికి ముఖ్యమంత్రి జగన్ ఒకసారి, స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మరొకసారి శంకుస్థాపన చేశారు. ఈ పనులు చేస్తున్న గుత్తేదారుడు అందుకు అవసరమైన పైపులైన్‌లు తయారు చేసి పనిప్రదేశానికి తరలిస్తున్నాడు. చెరువు అలుగు వద్ద నుంచి పొదిలి-దర్శి రోడ్డు వరకు సాగిన పనులు తరువాత కొంత జాప్యం జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరిగినా మరో ఏడాదికిపైగా పట్టవచ్చని అంచనా. దీని ద్వారా వచ్చే నీరు కేవలం పట్టణంతో పాటు శివారు గ్రామాలలో భూగర్భ జలాలు పెరుగుదలకు దోహదపడవచ్చు. ఈ లోగా ఎన్‌ఏపి పథకం ద్వారా వచ్చే తాగునీరు ఎంతవరకు అందుతుందో అనే అయోమయం నెలకొంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీరు ఒలకపోసుకున్నట్లుగా ఉంది అధికార పార్టీ నాయకులు తీరు. తాగునీరు ఇవ్వండి మహాప్రభో అంటే పెద్దచెరువుకు నీరు వస్తుంది అంటూ జోకులు వేసే పరిస్థితి పట్టణంలో నెలకొంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ పాదయాత్ర సందర్భంగా సుమారు ఐదు సంవత్సరాల క్రితం చిన్నబస్టాండ్ సెంటర్‌లో 'తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెద్దచెరువును సాగర్ నీటితో నింపుతామన్న హామీ నెరవేరలేదు. నీటి కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.