
ప్రజాశక్తి-నక్కపల్లి :నారుమడులలో పాము పొడ తెగులు తొలిదశలో వ్యాపించి ఉందని , నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.అప్పలస్వామి సూచించారు. మండలంలోని బుధవారం గుల్లిపాడు, డొంకాడ, గొడిచర్ల గ్రామాలలోని వరి నారుమడులను క్షేత్ర పర్యటనలో భాగంగా శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ అప్పలస్వామి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సంయుక్త సహకారంతో వ్యవసాయ అధికారి కె. ఉమా ప్రసాద్, బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రామడుగు ప్రవీణ్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వి.తులసీ మణి లతో కూడిన బృందం వరి నారుమడులను పరిశీలించారు. వరి నారుమడులలో గుంపులు గుంపులుగా నారుమడి చనిపోతుందని, మొదలు కుళ్లి ఎండిపోయినట్లుగా ఉంటుందని, ఇది పొడ తెగులు లక్షణమని రైతులకు అవగాహన కల్పించారు. ఈ తెగులు ఉధృతి పెరగకుండా నారుమడి కాపాడుకోవడం కోసం వెంటనే రైతులు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్ల చొప్పున హెక్సాకొనజోల్ మందును కలిపి, ఒక ఎకరా నారుమడికి కనీసం ఒక ట్యాంకి పిచికారి చేయాలని సూచించారు. తద్వారా తెగులును అదుపులోకి తీసుకురావచ్చు అని అన్నారు. ఇప్పటికే 15 రోజులు దాటిన నారుమళ్ళలో అంబటి కాడ, తుంగ వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు నియంత్రణకు బిస్ ఫైరీబ్యాక్ సోడియం కలుపు మందును ప్రతి పది లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఐదు సెంట్ల నారుమడిలో ఒక ట్యాంకు చొప్పున పిచికారి చేస్తే అన్ని రకాల కలుపు మొక్కలు చనిపోతాయన్నారు. వరి నారు ఎదుగుదల సరిగా లేనిచోట 19-19-19 పొడిమందును లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలుపుకుని ఒకసారి పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ అధికారులు సత్యనారాయణ, సురేంద్ర, రాజేష్, రజిత,రుఫీయా పాల్గొన్నారు.