Dec 26,2022 23:47

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు:నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో వివిధ పధకాల కింద చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల ప్రగతిని పిఐయు ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ, గత అక్టోబర్‌లో నిర్వహించిన సమీక్షలో పనుల పూర్తికి దిశా నిర్దేశం చేసినప్పటికీ కొన్ని పనులలో ప్రగతి కనబడకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో పని పూర్తి చేయని కాంట్రాక్టర్లకు ఐదు లక్షల రూపాయలు పెనాలిటి విధించాలని కార్యనిర్వాహక ఇంజినీర్‌ లావణ్య కుమార్‌ను ఆదేశించారు. ఆయా కాంట్రాక్టర్లతో మాట్లాడి సమయాల్ని నిర్దేశిం చాలన్నారు. నిర్దేశించిన సమయంలో సంబంధిత పనిని పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు, ప్రాజెక్ట్‌ అమలు విభాగం నిధులతో పాడేరు డివిజన్‌ ఫరిధిలో చేపట్టిన పనులపై తగు సమయం నిర్దేశించారు. జి.కే వీధి మండలంలో పనులు ప్రారంభించక పోవటం పట్ల అసహనం వ్యక్త పరచిన కలెక్టర్‌ డిఇఇకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు బి.రవికుమార్‌, డి.రవికుమార్‌, ఈశ్వరరావు, కళ్యాణ్‌, సహాయ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.