పనులు లేక పస్తులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
గత నెల 15 రోజులకు పైగా ఏదో ఒక సమయంలో రోజూ వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలతో భవన నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఎక్కడిక్కడ భవన నిర్మాణపనులు ఆగిపోయాయి. వర్షంలో నిర్మాణ పనులు చేస్తున్నా మధ్యలో వర్షంతో నిర్మాణ పని ఆగిపోయి సగం కూలీ తీసుకోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భల్లో వర్షం కారణంగా పూర్తిగా పనులు లేని రోజులున్నాయి. ఇలా భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్న భవన నిర్మాణ మేస్త్రీలు, కూలీలు పనులు దొరక్క పూటగడవడమే ఘగనంగా మారింది.
జిల్లా కేంద్రమైన చిత్తూరుకు భవన నిర్మాణపనుల కోసం బంగారుపాళ్యం, యాదమరి, గుడిపాల, జీడి నెల్లూరు, తవణంపల్లి, ఐరాల వంటి ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండీ కూలి పనులు చేసుకొనే కార్మికుల వేలసంఖ్యలో వస్తుంటారు. కార్మికశాఖ లెక్కల ప్రకారం ఒక్కరోజుకు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 4 వేల మందికి పైగా భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని పనిచేసే కార్మికులున్నారు. వరస వర్షాలతో ఈ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్న కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా కేంద్రమైన చిత్తూరు మార్కెట్ చౌక్ భవననిర్మాణ కూలీలకు అడ్డా..... పట్టణంలో నిర్మాణాలు చేపడుతున్న వారికి మేస్త్రీలు కూలీలు కావాలంటే ఉదయాన్నే ఇక్కడి వస్తే గుంపులు, గుంపులుగా కూలీలు, మేస్త్రీలు పనుల కోసం వేచి ఉంటారు. అయితే వర్షం కారణంగా పనులు దొరక్క తిరిగీ సొంత గ్రామాలకు వెళ్ళేందుకు చార్జీల కోసం మేస్త్రీ బంధువులను అడుక్కొవాల్సిన పరిస్థితి.
పనులు లేక పస్తులు..
భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కూలీలు పనులు లేక వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి. వరుసగా రోజూ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో భవననిర్మాణ పనులు జరగడం లేదు. ఏపూటకాపూట కూలి డబ్బులతో సరుకు తీసుకొనే కూలీలు కూలి పనులు లేక కుటుంబాన్ని కూడా పస్తులు పెట్టాలి వస్తుందని భవన నిర్మాణ కూలీలు వాపోతున్నారు. పని దొరికినా మధ్యలో వర్షం వస్తే సంగం కూలి మాత్రమే ఇస్తున్నారని, బస్సు ఛార్జీలు, భోజనం ఖర్చు పోను మిగిలేది ఏమీ లేదంటున్నారు. వరుసగా వర్షాలకు కురిసే సమయంలో ప్రభుత్వం భవన నిర్మాణ కూలీలను ఆదుకొనేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్మాణ పనులక ఉపయోగించే ఇసుక కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.










