
ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఎస్‌ఇజెడ్‌లోని రుషిల్ డెకార్ పరిశ్రమలో పని కల్పించకపోతే ఉరి వేసుకుంటామని ఆ కంపెనీ ముఠా కార్మికులు పరిశ్రమ యాజమాన్యాన్ని హెచ్చరించారు. 11వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ ఆవరణలో శనివారం ముఠా కార్మికులు ఉరితాళ్లు బిగించుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం, ఎమ్మెల్యే కుమ్మక్కై నిర్వాసితులుగా ఉన్న ముఠా కార్మికుల పొట్టలు కొట్టే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయకముందే లేబర్ కమిషనర్, ఏపీఐఐసీ అధికారులు కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే జరగబోయే పరిణామాలకు పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొర్లి సత్తిబాబు, అప్పలనాయుడు, సూరిబాబు, గణేష్, ముఠా కార్మికులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సిఐటియు వినతి
తమకు పని కల్పించాలని రుషిల్ డెకార్ ప్లైవుడ్ పరిశ్రమ ముఠా కార్మికులు 11 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని అనకాపల్లి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సువర్ణకు సిఐటియు నాయకులు శనివారం విన్నవించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో పరిశ్రమ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కూలి రేట్లు యధావిధిగా కొనసాగించాలని కోరారు. పరిశ్రమ స్థాపనకు భూములు ఇచ్చి నేడు ఉపాధి కరువై రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చాలా విచారకరమన్నారు. ఆనాడు రైతులు ఉదారంగా భూములు ఇవ్వని పక్షంలో నేడు పరిశ్రమలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము పాల్గొన్నారు.