గిట్టుబాటు కాని దినసరి ఉపాధి వేతనం
నీరు, నీడ, ఔషధాలు లేక పనిచోట అగచాట్లు
పనిముట్లు, వేసవి అలవెన్స్‌కు మంగళం
నిధులకు కోత పెట్టి, పథక నిర్వీర్యానికి కుట్ర
ప్రజాశక్తి -భీమునిపట్నం : గ్రామీణ ప్రాంతంలో కూలీలకు పని కల్పన, వలసల నివారణ లక్ష్యంతో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను గణనీయంగా తగ్గించేసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తనపని తాను చేస్తే, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉపాధి పనిప్రదేశంలో కనీస సౌకర్యాలు లేక కూలీలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను అధికార యంత్రాంగం చేపడుతోంది. పని కల్పిస్తున్నా కూలీ గిట్టుబాటు కాక, వేతనాలు, అలవెన్స్‌లు చెల్లింపుల్లో కోతలు పెడుతూ, పొమ్మనలేక పొగబెట్టే విధంగా కూలీలే తమంతట తాముగా ఉపాధి హామీ పథకాన్ని వద్దనుకునేలా చేస్తోందనే ఆరోపణలున్నాయి.
భీమిలి మండలంలో 3,796 జాబ్ కార్డులు ఉండగా, 5026 మంది కూలీలు ఉపాధి పని చేస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నా పనిప్రదేశంలో సౌకర్యాలే కూలీలకు ఇబ్బందికరంగా మారాయి. రేఖవానిపాలెంలో రూ.7లక్షలతో చేపల చెరువు పటిష్టం చేసే పనుల్లో 40 మంది కూలీలు పాల్గొంటున్నారు. సింగనబందలో రూ 9.50 లక్షలతో మామిడిబంద చెరువు గట్టు పటిష్ట వంతం చేసే పనుల్లో దాదాపు రెండు వందల మంది కూలీలు చేస్తున్నారు. మజ్జి పేటలో రూ.9.60 లక్షలతో ఎర్రాజీ చెరువులో 150 మంది కూలీలు పనులు చేస్తున్నారు. రూ.6.60 లక్షలతో మజ్జివలస, తాటితూరు, టి నగరపాలెం వరకు పంట పొలాలకు సాగునీరు అందించే కురపల్లి ఛానెల్ పూడికతీత పనులను 300 మంది కూలీలు చేస్తున్నారు. దాకమర్రిలో రూ.9.50 లక్షలతో మజ్జివానిచెరువు గట్టు పటిష్ట వంతం చేసే పనులను రెండు వందల మందికూలీలు చేస్తున్నారు. బోడమెట్టపాలెంలో రూ 1 50 లక్షలతో కాలువ తవ్వకం పనులు 60 మంది కూలీలు చేస్తున్నారు.
మచ్చుకైనా కానరాని సౌకర్యాలు
ఉపాధి హామీ పథకం వచ్చిన తొలినాళ్లలో పనిప్రదేశంలో టెంట్‌లు, తాగునీరు, ప్రధమ చికిత్స కిట్, కూలీల పిల్లలకు సరరక్షణగా ఆయా, పనిముట్ల ఉచిత పంపిణీ, వేసవి అలవెన్స్‌లు ఇలా ఎన్నెన్నో సౌకర్యాలను కల్పించే వారు. కానీ ప్రస్తుతం అవన్నీ మచ్చుకైనా కనిపించే పరిస్థితి లేదు. ప్రస్తుతం మండుటెండల్లో మాడు పగిలిపోయేలా పనిచేస్తున్న కూలీలకు సేదదీరేందుకు నీడనిచ్చే టెంట్లులేవు. వడదెబ్బకు గురికాకుండా ఒఆర్‌ఎస్, మజ్జిగలను పక్కనబెడితే, గొంతు తడుపుకునేందుకు మంచినీరు కూడా లేదు. పనిచేస్తూ, ప్రమాదవశాత్తు ఏదైనా గాయమైతే, రక్తస్రావం కాకుండా మట్టిగానీ, ఆకుపసరగానీ రాసుకోవాలే తప్ప, అయోడిన్, కాటన్ ఉండే ఫస్ట్‌ఎయిడ్ కిట్లు కానరావు.
పథకం నిర్వీర్యానికే కుట్ర!
ఇక పనిముట్ల విషయానికొస్తే, వందరోజుల ఉపాధి పనిచేసే వారికి గునపాం, పార వంటి పనిముట్లు ఉచితంగా ఇచ్చేవారు. వాటితోపనిచేస్తే ప్రత్యేక అలవెన్స్ ఉండేది. ఇపుడు పనిముట్లూ లేవు. అలవెన్స్ ఊసే లేదు. ప్రత్యేకంగా వేసవిలో ఇచ్చే అలవెన్స్ ఇపుడు చెల్లించడం లేదు. ఇలా నిధులు, సౌకర్యాలన్నీ ఒక్కటొక్కటిగా కట్ చేస్తూ, చివరకు పథకానికి మంగళం పాడే చర్యలనే ప్రభుత్వం చేస్తోందని కూలీలతోపాటు ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గరిష్ట వేతనం అందుకోవడం గగనమే
ఉపాధి పనివేళల్లో మార్పులు, ఇతర సంస్కరణల పుణ్యమాని కూలీలు రోజువారీ చేసిన పనికి గరిష్టవేతనం అందుకోవడం గగనమనే చెప్పాలి. మారిన నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం వేళ్లలో పనిచేస్తే రోజుకు గరిష్ట వేతనం రూ.272 చెల్లిస్తారు. అయితే చేసిన పని ఆధారంగా చెల్లింపులు ఉండడంతో గరిష్ట వేతనం సంపాదించడం కూలీలకు కష్టంగానే ఉందని అంటున్నారు. మరోవైపు కూలీలు, కార్మికసంఘాలు ఉపాధి వేతనాన్ని రోజుకు కనీసం రూ.600 చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన వేతనం ఇచ్చే పరిస్థితి లేదని కూలీలు వాపోతున్నారు. గతంలో వేసవి అలవెన్స్, పనిముట్ల అలవెన్స్, కూలీల నైపుణ్యత ఆధారంగా అదనపు కూలి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉన్నా, ఇపుడవన్నీ రద్దు చేసేశారు. ఇప్పటికైనా ఉపాధి హామీ పథకాన్ని నాటి యుపిఎ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ప్రారంభించిందో, దానికంటే అదనపు ప్రయోజనాలు కల్పించకున్నా, ఉన్నవాటికి ఎసరు పెట్టకుండా ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అమలు చేయాలని కూలీలు కోరుతున్నారు.
జాబ్‌కార్డున్న వారికి ఉపాధి
జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధిహామీ పథకం కింద పని కల్పిన్తూ, నిర్ణీత సమయంలోనే వేతనాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.60లక్షల పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా, ఏప్రిల్, మే నెలల్లో 70 వేల పని దినాలు కల్పించాం. రూ కోటి 61 లక్షల వేతనాలు చెల్లించాం. జాబ్ కార్డు ఉన్న వారికి ఏడాదిలో 100 రోజులు పని, తాగునీటికి రెండు లీటర్లకు రూ.10, వారంలో ఒకసారి గునపాం పదునుపెట్టేందుకు రూ.ఐదు అలవెన్స్‌ను వేతనంతో కలిపి ఇస్తున్నాం.
జి వెంకటగౌరి, ఎపిఒ
ఎన్‌ఆర్‌ఇజిఎస్, భీమునిపట్నం
పని ప్రదేశంలో సౌకర్యాలేవి?
పని ప్రదేశంలో ఎటువంటి సౌకర్యాలూ లేవు. ఎండలో పనిచేసే సందర్భంలో విశ్రాంతికి టెంట్ లేదు. దాహార్తి తీర్చేందుకు పక్కనబెడితే, ఎండకు స్పృహతప్పి పడిపోయినా ముఖాన చల్లేందుకు నీరు లేదు. ఇలాగైతే ఎలా పనిచేయగలం?
కరుబోతు కొండమ్మ,
ఉపాధి కూలి, సింగనబంద
గాయమైతే అంతే సంగతులు
పనిచేస్తుండగా గాయమైతే ప్రధమచికిత్స చేసేందుకు కాటన్ గానీ, అయోడిన్ గానీ అందుబాటులో లేదు. పనిచోటు నుంచి ఆసుపత్రికి వెళ్లాలంటూ ఐదారు కిలోమీటర్లు దూరం. ప్రస్తుతం వేసవిలో ఉదయం ఆరుగంటల్లోపే పనికెళ్లి, 11గంటల్లోగా ఇంటికి చేరుతున్నా, మధ్యలో జ్వరం, తలనొప్పి వస్తే మందులిచ్చే దిక్కులేదు.
గాడు లక్ష్మి,
ఉపాధి కూలి, సింగనబంద










