ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రజలు అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఉపాధి అవకాశాలు కల్పించాలని, అధిక ధరలు తగ్గించి రేషన్ షాపుల ద్వారా బియ్యం, కందిపప్పుతో పాటు ఇతర నిత్యావసరాలనూ పంపిణీ చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి పాదయాత్ర పట్టణంలో ఐదో రోజైన మంగళవారమూ కొనసాగింది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేశారు. వెంగళరెడ్డి నగర్, రఘురాం నగర్, నాగార్జున నగర్, 24వ వార్డు, సొసైటీ ఏరియా, వావిలాల నగర్లలో యాత్ర పర్యటించగా అనేక సమస్యలను ఆయా ప్రాంతాల ప్రజలు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. వర్షాల్లేక వ్యవసాయం తగ్గిందని, దీంతో తమకు పనుల్లేకుండా పోయాయని పలువురు మహిళలు తెలిపారు. కుటుంబాలు గడవడం కష్టమవుతోందని, ఉపాధి చూపాలని కోరారు. డ్రెయినేజీ కాల్వల్లో మురుగును సరిగా తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని, దోమల బెడద తీవ్రంగా ఉందని వాపోయారు. వావిలాల నగర్‌లో విద్యుత్ సరఫరా లేక రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అనంతరం విజరుకుమార్ మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణం విస్తరిస్తున్నా అందుకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులే సరిగా పనిచేయడం లేదనే భావన ప్రజల్లో కలుగుతోందని చెప్పారు. కార్మికుల సంఖ్యను పెంచి పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుకతోపాటు భవన నిర్మాణ సామగ్రి ధర పెరుగుదల కారణంగా నిర్మాణ రంగం మందగించి భవనిర్మాణ కార్మికులకు పని దినాలు తగ్గాయన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు నిధులను గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం మళ్లిస్తున్నాయని మండిపడ్డారు. ఇదిలా ఉండగా 21, 22 వార్డులో సచివాలయాన్ని పాత కబేళా స్థలానికి మార్చాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు రాజకుమార్, ఎ.వెంకటనారాయణ, ఎ.వీరబ్రహ్మం, ఎం.హరిపోతురాజు, పి.ప్రభాకర్, జి.సుసులోవ్, జి.మస్తాన్‌రావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : వ్యవసాయం మేమే చేస్తున్నాం.. పంటలు మేమే పండిస్తున్నాం.. నష్టాలనూ భరిస్తున్నాం.. అయినా రైతు భరోసా మాత్రం రావడం లేదు.. అని సిపిఎం పాదయాత్ర బృందం ఎదుట పలు గ్రామాల కౌలురైతులు ఆవేదన వెలిబుచ్చారు. మండలంలోని నందిగాం, గుడిపూడి, పెద్దమక్కెన, ఫణిదం గ్రామాల్లో సిపిఎం పాదయాత్ర రెండోరోజైన మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సమస్యలను నాయకులకు స్థానికులు వివరించారు. సిపిఎం పట్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పంట రుణాలు, రైతు భరోసా, ఇతర రాయితీలు, నష్టపరిహారాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వాస్తవ సాగుదారులైన కౌలురైతులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ ఆవేదన కౌల్దార్లలో తీవ్రంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీ సరిగా లేకపోవడంతో మరుగు నీరు చేరుతోందని, దోమలు పెరిగి డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయని అన్నారు. ఆయా కాలనీల్లో సత్వరమే సిసి రోడ్లు నిర్మించాలని కోరారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా ఇళ్ల నిర్మాణం కష్టతరమైందని, మరోవైపు ప్రభుత్వం ఆందించే ఆర్థిక సాయం సరిపడగా అనేక ఇళ్లు బేస్‌మెంట్ దశలోనే ఆగిపోతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటికి రూ.6 లక్షల సాయం అందిస్తేనే ఇళ్లు పూర్తవుతాయన్నారు. కాలనీలకు రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్ మాట్లాడుతూ సమస్యల నిలయాలుగా గ్రామాలున్నాయని, నందిగంలో వాగు నీరు వెళ్లకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పరిష్కరించలేదని విమర్శించారు. గుడిపూడి ఎస్టీ కాలనీలో సిసి రోడ్లు లేక మురుగు నీరంతా రహదార్లపైకి చేరి కాల్వలను తలపిస్తోందని చెప్పారు. స్థానికులు తీవ్ర తాగునీటి సమస్యను, రైతులు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళనబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టి.పెద్దిరాజు, వి.తులసిరామ్, ఆర్.పూర్ణచంద్రరావు, బి.శివయ్య, కె.సాయికుమార్, డి.అమూల్య, వెంకటేశ్వర్లు, అనుష, సుజాత, సత్యవతి, గణేష్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలో సిపిఎం చేపట్టిన పోరుయాత్ర మూడో రోజుకు చేరింది. రుద్రవరం, తొండపి, బొల్లవరం, దమ్మాలపాడు గ్రామాల్లో మంగళవారం యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇప్పటికీ కూలి డబ్బులు రాలేదని, స్థానికంగా పనుల్లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని పలువురు కూలీలు వాపోయారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శిశర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టులో సాగునీటిని విడుదల లేకపోవడంతో పొలాలు సాగవ్వలేదని, దీంతో కూలీలకు పనులు తగ్గాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మండలాన్ని కరువు మండలంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సొంతూళ్లలోనే పనులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.జాలయ్య, కె.సాంబశివరావు, ఎం.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, పి.సైదాఖాన్, సిహెచ్.నాగమల్లేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










