ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలో పేదలకు సెంటు స్థలం పంపిణీకి సంబంధించిన లే అవుట్‌లలో అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని సిఆర్‌డిఎ కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. దొండపాడు సమీపంలోని పిచికలపాలెం లే అవుట్‌లో పనులను ఆయన గురువారం పరిశీలించి మాట్లాడారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు సెంటు స్థలం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రెండు జిల్లాల్లోని అర్హులైన వారికి నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచికలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు అనంతవరం ప్రాంతాల్లోని 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మొత్తం 51,392 మంది లే అవుట్ లలో అభివృద్ధి చేయనున్న ప్లాట్లను సిఎం జగన్ మోహన్‌రెడ్డి ద్వారా పంపిణీకి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. సిఎం ఆదేశాల మేరకు మొదటి దశలో ఎన్‌టిఆర్ జిల్లాకు కేటాయించిన 583.93 ఎకరాల్లో 11 లే అవుట్‌లు, గుంటూరు జిల్లాకు కేటాయించిన 550.65 ఎకరాల్లో 10 లే అవుట్‌లలో 40,502 ప్లాట్లను అభివృద్ధి చేశామన్నారు.
ఇదిలా ఉండగా జీవో 59 ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మరో 268 ఎకరాలలో చేపడుతున్న లే అవుట్ అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం పిచికలపాలెంలో పనుల పురోగతిని పరిశీలించారు. 268 ఎకరాలలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్‌లలో ఎన్‌టిఆర్ జిల్లా లబ్ధిదారులకు ఇచ్చే బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచికలపాలెంలో 101.56, అనంతవరంలో 64.39 ఎకరాలు, గుంటూరు జిల్లా లబ్దిదారులకు నెక్కల్లులో 100 ఎకరాల్లో 10,890 ప్లాట్లు ఏర్పాటుకు టెండర్లు ప్రక్రియను పూర్తి చేశామని కమిషనర్‌కు అధికారులు వివరించారు. ఆయా లే అవుట్‌లలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశామన్నారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థలు పనులు ప్రారంభిస్తాయని వివరించారు. 1,402.58 ఎకరాల్లో 25 లే అవుట్‌లు వేసి మొత్తం 51,392 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్లాట్లను పేదలకు సిఎం ద్వారా అందిస్తామని కమిషనర్ ్తఎలిపారు. ప్రస్తుతం ప్లాట్ల ఏర్పాటుకు అనువుగా లెవెలింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టు సంస్థలు అంతర్గత గ్రావెల్‌తో రోడ్లు అభివద్ది, ప్లాట్ల లో హద్దు రాళ్ళు సమకూర్చి లబ్ధిదారులకు ఆవాసయోగ్యంగా ఇళ్ల స్థలాల మార్కింగ్‌తో నంబరింగ్ వేయడం తదితర పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు చెప్పారు. పరిశీలనలో సిఆర్‌డిఎ చీఫ్ ఇంజినీర్ జివి పల్లంరాజు, ఉద్యోగులు ఉన్నారు.










