ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: జల జీవన్ మిషన్(జెజెఎం) ప్రాజెక్టు పనులను 2024 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో అందరు పని చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని జెజెఎం జిల్లా కో-ఆర్డినేటర్ పుల్లయ్య సూచించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండలంలోని గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెజెఎం(జల జీవన్ మిషన్)ప్రాజెక్టు పనులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ, జెజెఎం ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొళాయిలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ముంచంగిపుట్టు మండలం లో 258 గ్రామాలకు రూ.29కోట్లు45లక్షల నిధులు మంజూరైందన్నారు. గ్రామాల్లో గ్రావిటీలు ఉన్న గ్రామాలను సర్వే చేసి గుర్తించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. గ్రామాల్లో పనులను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్, కార్యదర్శిలతో కూడిన 15 మందితో కమిటీని నియమించుకుని ఆ సభ్యుల ద్వారా జెజెం పనులు చేపట్టాలన్నారు. త్వరితగతిన జెజెం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కిరణ్ కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈఈ గోపాల్ కృష్ణ, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శిలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










