ప్రజాశక్తి - పార్వతీపురం : పిహెచ్‌సిల్లో నాడు-నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖాధికారులను కలెక్టరు నిశాంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో వైద్య, ఆరోగ్యశాఖపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు కావలసిన మౌళిక సదుపాయాలు, సిబ్బంది నియామకం ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమకూర్చుతుందని, కావున వైద్యులు నిబద్దతతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. ప్రసవ మరణాలు సంభవిస్తే నామమాత్రపు చర్యలతో ఉపేక్షించడం కుదరదని, భవిష్యత్తులో ప్రసవ మరణాలు సంభవిస్తే అందుకు బాధ్యలైన అధికారులు, సిబ్బంది భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మలేరియా, డెంగీ జ్వరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని, స్ప్రేయింగు పూర్తికాని గ్రామాల్లో వెంటనే పూర్తిచేయాలని, ఒకే గ్రామంలో ఎక్కువ కేసులు వస్తే నియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు. జ్వరాల కేసులను నిరంతరం పర్యవేక్షించి, వారికి వైద్యమందించాలని తెలిపారు.
పిహెచ్‌సిల్లో నాడు-నేడుకింద చేపట్టిన పనులలో నాణ్యతా ప్రమాణాలు లేవని వైద్యాధికారులు తెలుపగా, పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు చేయడం జరిగిందని, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు పదిరోజుల్లో సరిదిద్ది పనులు పూర్తి చేయించాలని, పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటులో నమోదు ప్రక్రియ రెండు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టరు తెలిపారు. యాప్ నమోదు ప్రక్రియను ఎఎన్‌ఎం స్థాయి వరకు తెలియజేయాలన్నారు. పిహెచ్‌సిల పరిధిలో సేవాలోపాలకు సంబంధిత మెడికల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, సరిగా పనిచేయని సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులకు మెరుగైన సేవలందించేందుకు స్థానికులకు ప్రాధాన్యమిస్తూ ఆశా వర్కర్లను నియమించామని, సరిగా పనిచేయని ఆశా వర్కర్లపై నివేదిక సమర్తిస్తే, వారిపై చర్యలు తీసుకొని వారి స్థానంలో మరొకర్ని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికులు అందుబాటులో లేనప్పుడు స్థానికేతరులకు కూడా అవకాశమివ్వాలని తెలిపారు. వైద్యశాఖలో ఖాళీల నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. సీతంపేట, సాలూరు, పార్వతీపురంలో భవన నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డి. భాస్కరరావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంటు వాగ్దేవి, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.










