ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని లైలాండ్ పంచాయతీ పనసపొట్టు గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలైన సిసి రోడ్లు, వీధి కాలువలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్ పర్సన్ పాచిపెంట శాంత కుమారి డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో హెల్త్ వాలంటీర్లను నియమించి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేయాలన్నారు. జీవో 3ను పునరుద్ధరించి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు గిరిజనులకే ఖర్చు చేయడం డిమాండ్ చేశారు. గిరిజన హక్కులు చట్టాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. గిరిజనుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ టి సోమేశ్వరరావు, పిసిసి సభ్యుడు పి.చిన్నస్వామి, మండల అధ్యక్షుడు కే.జగన్నాథం, నాయకులు పరశురాం, రాజబాబు, మాజీ ఎంపిటిసి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అసంపూర్తి వంతెనతో అవస్థలు
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:అసంపూర్తిగా ఉన్న కొర్రాయి వంతెనను వెంటనే పూర్తి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్చార్జ్ సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు. అసంపూర్తి వంతెనను సోమవారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వంతెన అసంపూర్తిగా ఉండటంతో రాకపోకలకు వాహనదారులు, ఆ ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వంతెనను పూర్తి చేసి గిరిజనులకు ఇబ్బంది కలకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.










