Jul 22,2023 00:57

మాట్లాడుతున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని పనసలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 2, 3, 4, 6, 11 సాగులో లేనటువంటి జగనన్న రీసర్వే లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులకి ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కి స్పందనలో చేసిన ఫిర్యాదుపై శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి.జయరాం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.అనంతరం ఆర్డీవో, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి దళితులు, గిరిజనులు సాగు భూములను కాలినడక వెళ్లి పరిశీలించారు. 50 సంవత్సరాల నుండి జీడిమామిడి, టేకు, సరుగుడు తోటలపై 50 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నామని, జగనన్న రీ సర్వేలో గత తహశీల్దార్‌ సాగులో ఉన్న వారిని లేనట్టుగా సాగులో లేని వారిని స్థానికేతరులకు పట్టాలు ఇచ్చారని ఆర్డీవో ముందు వాపోయారు. ఈ పట్టాలు వెంటనే రద్దు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్‌కి నివేదిక పంపిస్తామని ఆర్‌డిఒ చెప్పారు. రెవెన్యూ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు కుమ్మక్కై ఆర్‌ఓఆర్‌ చట్టానికి వ్యతిరేకంగా పాల్పడిన రెవిన్యూ అధికారి పై చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ పాల్తేటి పెంటారావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవిలు డిమాండ్‌ చేశారు.