Jun 25,2023 00:50

నినాదాలు చేస్తున్న నాయులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:గిరిజన వారసత్వ భూముల్లో గిరిజనేతరులకు ఇచ్చిన హక్కు పత్రాలు రద్దు చేయాలని, ఈ విషయమై రోలుగుంట తహసిల్దార్‌ పై చర్యలు తీసుకోవాలని రోలుగుంట మండలం పనసలపాడు గిరిజనులు నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో గిరిజన భగత తెగకు చెందిన ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమకు వారసత్వంగా వస్తున్న జిరాయితి భూముల హక్కు పత్రాలు కలిగి ఉన్నామని, జగనన్న భూ రీసర్వేకు పలసలపాడు గిరిజన గ్రామాన్ని మొదటి విడతగా ఎంపిక చేసి డ్రోన్‌ సర్వే చేశారన్నారు. రెవిన్యూ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు కుమ్మకై గిరిజన జిరాయితి భూములు సర్వే నెంబర్‌ 8-1.6-9.6-1-4.3లో 15 ఎకరాలను గిరిజనేతరులైన మాజీ సర్పంచ్‌ తమటాపు సత్యం నాయుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు పేరు మీద జగనన్న భూహక్కు పత్రాలు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గిరిజనేతరులకు హక్కుపత్రాలు ఇచ్చిన తహసిల్దార్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు, గెమ్మెల నూకినాయుడు, చిన్నబ్బాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.