Apr 02,2023 00:29

మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి

ప్రజాశక్తి - యలమంచిలి
ఇంటి పన్నుల వసూలులో యలమంచిలి మున్సిపాలిటీ ఉత్తరాంధ్రలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణి తెలిపారు. శనివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానాఇకి మున్సిపాలిటీ ఇంటి పన్నుల లక్ష్యం రూ.3.7 కోట్లు కాగా, రూ.2.91 కోట్లు వసూలు చేయడం జరిగిందని వెల్లడించారు. విశాఖ రీజియన్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉండగా, యలమంచిలి మున్సిపాలిటీలో పన్నులు 94.78 శాతం వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇంటిపన్నులు కాక ప్రభుత్వ భవనాలు, ఖాళీ స్థలాలపై రూ.25 లక్షల పన్నులు వసూలు చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ కలిపి మున్సిపాలిటీ మొత్తం పన్ను వసూలు రూ.3.16 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీల్లో యలమంచిలి 20వ స్థానం కైవసం చేసుకోవడం సంతోషదాయకమన్నారు. రికార్డ పన్ను వసూళ్లకు పాలకవర్గం ఎంతో సహకరించిందని కమిషనర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్‌ నీలిమ పాల్గొన్నారు.