విజయవాడలో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఇల్లు - 291 చ.గ
ప్రస్తుత పన్ను - రూ.4312
ఇంటి విలువ రూ.1,30,70,847
0. 15 శాతం ప్రకారం కొత్త పన్ను - రూ. 19,618 (450%)
0. 5 శాతం ప్రకారం రూ. 65,000 (1500 %)
పట్టణాలలో ఇంటిపన్ను 15 శాతం మించి, రూ. 186 కోట్లకు మించి భారం పడదని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారు. పన్నులు పెంచటమే కాదు, పన్ను విధించే విధానాన్ని మౌలికంగా ప్రభుత్వం మార్చేసింది. ఇప్పటివరకు అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించే విధానం ఉంది. ఇప్పుడు ఆస్తి విలువ (రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన స్థలం విలువ, ఇంటి నిర్మాణం విలువ)పై...నివాసాలపై 0.1 నుండి 0.5 శాతం వరకు, నివాసము కానీ వ్యాపార, ఇతర సంస్థలపై 0.2 నుండి రెండు శాతం వరకు పన్ను విధించడానికి చట్ట సవరణ చేశారు. 198 నెంబర్ జీవో విడుదల చేశారు. ఈ విధానం వలన అనేక రెట్లు పన్ను భారం పెరుగుతుంది. చాలాకాలం నుండి ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానం అమలు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఈ విధానాన్ని రాష్ట్రాలు, ప్రజలపైన రుద్దింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం, ఖజానా నింపుకోవడానికి కేంద్రానికి లొంగిపోయి చట్ట సవరణ చేసింది. అమలు ప్రారంభించింది.
కరోనా కాలంలో పన్నులు తగ్గించాలని జనం కోరుతున్నారు. తగ్గించకపోగా ప్రభుత్వం పెంచింది. పైగా ఇది పెద్ద భారం కాదని ప్రభుత్వ పెద్దలు వాదించటం దారుణం. ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున పెంచుకుంటూ పోతారు. అంటే ఐదేళ్లలోనే 100 శాతం పెరుగుతుంది. క్రమంగా పన్ను ఆస్తి విలువ స్థాయికి చేరుకోగానే 15 శాతం పరిమితి లేకుండా మున్సిపాలిటీ నిర్ణయించిన పన్ను శాతాన్ని బట్టి పూర్తి స్థాయి పన్ను వసూలు చేయాలని జీవో లో పొందుపర్చారు. అంతే కాకుండా భూముల విలువలను ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతుంది. ఆ విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం ఇంటిపన్ను పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు స్టార్ హోటల్ మొదలుకొని చిన్న షాపు వరకు అందరికీ ఒకేరకమైన పన్ను రేటు నిర్ణయించారు.
ఇళ్లకు 2002 నుండి, వ్యాపార సంస్థలకు 2011 నుండి ఇప్పటివరకు ఇంటి పన్ను పెంచలేదని మరో వాదన చేస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. ముక్కముక్కలుగా, పలు రూపాలలో భారాలు మోపారు. గదులు పెరిగాయని, కప్పు మారిందని, వ్యాపారం చేస్తున్నారని రకరకాల సాకులు చెప్పి పన్నులను విడివిడిగా దశలవారీగా పెంచారు. మంచినీరు, డ్రైనేజీ చార్జీలు కొద్ది సంవత్సరాల క్రితమే విజయవాడలో ఒకేసారి 200 నుండి 300 శాతం పెంచారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 7 శాతం చొప్పున పెంచుకుంటూ వెళుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు భవన నిర్మాణ ఫీజులు, సదుపాయాల కోసం డెవలప్‌మెంట్ ఛార్జీలు, ఆఖరికి మొక్కలు వేస్తే దాని చుట్టూ వేసే ట్రీ గార్డులకు ప్రజల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నులపై అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కొన్ని చోట్ల అదనంగా వేసి, ఆ తర్వాత ఇంటి పన్నుల్లో కలిపేశారు. ఈ రకంగా పరోక్షంగా పెంచుకుంటూ వెళ్లారు.
ఇంటి విలువ పెరిగితే పన్ను పెంపు తప్పదు కదా అని మరో వితండవాదం చేస్తున్నారు. ఇల్లు కొనుక్కున్నప్పుడు పెరిగిన విలువను బట్టి స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు. ఇన్‌కమ్ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్, ఇతర పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తారు. సొంత ఇంటిలో నివాసం ఉన్నా, కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చినా అద్దె విలువ పెరుగుతుంది తప్ప, ఆస్తి విలువ బట్టి ప్రతి సంవత్సరం అదనపు ఆదాయం రాదు. ఈ విషయంలో ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. అవినీతిని అరికట్టడానికి, పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం పెట్టామని మరో అబద్ధం చెబుతోంది. వాస్తవానికి అధికారులే కాదు...ప్రజా ప్రతినిధులు కూడా...ఇల్లు కట్టడం మొదలు వివిధ సందర్భాలలో రేట్లు కట్టి మరీ ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నారు. పైనుండి కింది వరకు ఈ అవినీతికి కారణమైన పాలకులే అవినీతిని అరికట్టే పేరుతో మళ్లీ ప్రజలపై పన్నులు మోపడం హాస్యాస్పదం. అద్దె విలువలను ప్రతి ఇంటికి అధికారులు విడివిడిగా నిర్ణయించటం లేదు. ప్రాంతాలను బట్టి అద్దె విలువలను మున్సిపాలిటీలే నిర్ణయించే విధానం అమలులో ఉంది. లోపాలుంటే సరి చేయవచ్చు. కానీ ఆదాయం పెంచుకోవటం కోసం అడ్డదారి తొక్కటం అర్ధరహితం.
నిజంగా 15 శాతం పన్ను పెంపే ప్రభుత్వ లక్ష్యం అయితే, దీనికోసం చట్ట సవరణ అవసరం లేదు. ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం ప్రవేశపెట్టాల్సిన అగత్యం లేదు. ప్రభుత్వ ఉద్దేశం ఒకటి, చెబుతున్నది మరొకటి.
ఇంటి పన్నుతో పాటు ఈ నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా క్లీన్ ఏపీ పేరుతో చెత్త పన్నులు ప్రవేశపెట్టారు. సగటున ప్రతి కుటుంబం నుండి సంవత్సరానికి రూ. 720 నుండి రూ. 1440 వరకు, వ్యాపార సంస్థలకు రూ. 2400 నుండి రూ. 1,80,000 వరకు వసూలు చేసే రేట్లు నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల కుటుంబాలకు సగటున వెయ్యి రూపాయల చొప్పున 500 కోట్లు, ఐదు లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై సగటున రూ.5 వేలు చొప్పున రూ. 250 కోట్లు మొత్తం కలిపి రూ.750 కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడుతుంది.
కరోనా సమయంలో పారిశుధ్యం, ప్రజారోగ్యంతో వ్యాపారం చేయడం తగునా? ఇకనుండి పారిశుధ్యం, మంచినీరు, డ్రైనేజీ నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టాలని, ప్రతి సంవత్సరం ఈ చార్జీలు తదనుగుణంగా పెంచాలని చట్టంలో పొందుపరిచారు. ఇదే ప్రమాదకర విధానం. 375 చదరపు అడుగులు లోపు ఇళ్లకు ఆస్తి పన్ను 50 రూపాయలు చెల్లిస్తే చాలని ప్రకటించారు. ఈ అంశం చట్టంలో ఉన్నా నోటిఫికేషన్ లో ఎక్కడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కేటాయించే సెంటు స్థలంలో ఇల్లు కట్టుకున్నా రూ. 50 నిబంధన వర్తించదు. అందరిలాగానే పన్ను పడుతుంది. 40 గజాల లోపు ఉండే ఇళ్ళు అతి తక్కువ. అందులోనూ పైఅంతస్తులో రేకుల షెడ్డు వేసుకున్నా విస్తీర్ణం ఎక్కువైందని ఆ పన్ను తగ్గింపు వర్తించదు. ప్రస్తుతం ఉన్న చట్టంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు రెండు రూపాయల పన్ను మాత్రమే వసూలు చేయాలని ఉన్నా, అది ఎక్కడా అమలు జరగటం లేదు. ఇంటి పన్ను కంటే మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీలు అధికమయ్యాయి. ఈ చార్జీల నుండి పేదలకు మినహాయింపు లేదు. ఆ విషయం ప్రభుత్వం చెప్పకుండా తప్పుదారి పట్టిస్తోంది. మరోవైపు పట్టా లేకపోతే అదనంగా మరో 100 శాతం పన్ను విధించడానికి నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం పట్టా ఇవ్వదు. పట్టా లేదని అదనపు వడ్డింపులు మాత్రం చేస్తుంది. అద్దెదారుల పైన పన్నుల పెంపు ప్రభావం పరోక్షంగా ఉంటుంది. వ్యాపార సంస్థలు వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి. ఈ భారం మొత్తం ప్రజలు కట్టాల్సిందే.
ఆస్తి విలువ ఆధారిత పన్ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఇప్పటివరకు కర్ణాటక లోని మున్సిపాలిటీలు, మహారాష్ట్ర లోనే అమలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మాత్రమే ముందుగా అంగీకరించాయి. దేశం లోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం లేదు. గతం నుండి ప్రపంచ బ్యాంకు ఇవే విధానాలను సూచిస్తోంది. గత పాలకుల హయాంలో జవహర్‌లాల్ నెహ్రూ స్కీమ్, నేటి బిజెపి ప్రభుత్వ స్మార్ట్ సిటీలు, అమృత్ పథకాలు, ఫైనాన్స్ కమిషన్ నిధులకు ప్రమాదకర షరతులకు ముడిపెట్టారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ఇదే విధానాలను అమలు చేయడానికి ప్రయత్నించాయి. అయితే బిజెపి మరింత దూకుడుగా అమలు చేస్తోంది. దీనినీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సింది పోయి సమర్థించడం శోచనీయం.
ప్రతిసారి పన్నులు పెంచేటప్పుడు పాలకులు ఇదేరకమైన వాదనలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను పేరుతో జిఎస్‌టి తెచ్చినప్పుడు, ఇక పన్నుల వేధింపుల నుండి విముక్తి అని నమ్మబలికారు. ఆచరణ ఏమైందో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రజలను మభ్యపరిచి సంస్కరణలను అమలు చేసే తప్పుడు పద్ధతులను పాలకులు అమలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇక ప్రభుత్వం నిర్ణయించదని, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే తగ్గుతుందని తియ్యగా చెప్పారు. ఏం జరిగింది? ముక్కముక్కలుగా ప్రతి రోజూ పెంచుతూ ప్రజల కళ్ళు కప్పుతున్నారు. వంటగ్యాస్ సబ్సిడీ పేరుతో మోసం చేసి దశల వారీగా సబ్సిడీ ఎత్తివేశారు. విద్యుత్ చార్జీలు పెంచలేదని చెబుతూ విద్యుత్ బిల్లులు మాత్రం పెంచేస్తున్నారు. పెనాల్టీలు, పాత బకాయిలు అనే పేరుతో రకరకాలుగా పిండుతున్నారు. ఈ విధానాల అమలుకు ప్రధాన ముద్దాయి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం. కానీ అదే బిజెపి నేతలు రాష్ట్రంలో ఆస్తిపన్ను తగ్గాలని ఆందోళన చేయటం విడ్డూరం. వారికి చిత్తశుద్ధి ఉంటే షరతులు రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేయాలి. మోడీని కోరాలి. ఈ విధానాల పాపం వారిదే. దానికి వత్తాసు పలికిన వైసిపి దే.
పన్నులు పెరక్కుండా మున్సిపాలిటీలు ఎలా నడుస్తాయని ప్రజల ముందు మరో వాదన చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వాలది, స్థానిక సంస్థలదే. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నుండి రాష్ట్రాలకు వాటా ఇవ్వటం, రాష్ట్ర ఆదాయంలో నుండి స్థానిక సంస్థలకు వాటా ఇవ్వటం 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తి. ప్రతి పట్టణంలో జిఎస్‌టి, వ్యాట్ ఇలా అనేక రకాల పన్నులు వసూలవుతాయి. ఈ పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాలో వేసుకుంటూ, అభివృద్ధి పేరుతో మళ్లీ మున్సిపాలిటీలలో ప్రజలను పన్నుల పేరుతో పీడించడం దుర్మార్గం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా రాయితీలు ఇస్తున్నాయి. వారికి బ్యాంకులు రుణమాఫీ చేస్తున్నాయి. అదే పాలకులు...ప్రజలు పన్నులు కట్టకపోతే ఎలా అని వాదించడం విడ్డూరం.
సంఘాలతో మాట్లాడిన తర్వాత, వారు కోరిన దానికంటే తక్కువ పెంచామని మంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సంఘాలతో చర్చించలేదు. పైపెచ్చు మూడు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిళ్ళలో వారి పార్టీవారే అత్యధికంగా ఉన్నా ఎన్నికైన కౌన్సిళ్ళతో కూడా చర్చించలేదు. ప్రజల్లో వ్యతిరేకత లేదని చెత్త పన్నును ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి వల్లెవేస్తున్నారు. ఇదొక అవాస్తవం. చట్టం చేసినప్పుడు ప్రజలకు వాస్తవాలు పూర్తిగా తెలియదు. మున్సిపాలిటీ కమిషనర్ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత చర్చ ప్రారంభమైంది. పార్టీలు స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముందు నుండి పౌర సమాఖ్య, ఇతర సంఘాలు చట్ట సవరణలు చేసినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు, ఆందోళనలు సాగిస్తున్నాయి. వాటికి ప్రజలు మద్దతు ఇచ్చారు. క్రమంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. జూన్ 30, జులై ఒకటవ తేదీల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలకు సమాఖ్య పిలుపునిచ్చింది. ఈలోపు సంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్ నడుస్తుంది. ప్రజలు వాస్తవాలను గమనించి ఇందులో భాగస్వాములు కావాలి.
/ వ్యాసకర్త ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ /
సిహెచ్. బాబూరావు











