-రూ 20 కోట్ల వసూలు లక్ష్యం : ప్రత్యేక బృందాల ఏర్పాటు : కాకినాడ నగరపాలక కమిషనర్ మహేష్ కుమార్
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నెల ఏప్రిల్ 30 చివరి నాటికీ ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మహేష్‌కుమార్ రావిరాల ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో బుధవారం అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్‌తో కలిసి పన్నుల వసూళ్లు, రిబేటు, నీటి పన్నులపై వాటర్ వర్క్స్ అధికారులు,ఆర్వోలు, ఆర్‌ఐలు, సచివాలయ కార్యదర్శులతో సమీక్షించారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులందరికీ తెలిసేలా మరింత విస్కత ప్రచారం చేయాలన్నారు.
మరో 10 రోజుల్లో గడువు ముగుస్తున్నందున సంబంధిత ఉద్యోగులంతా ఈ అంశంఃపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పన్ను రాయితీ వల్ల గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ద్వారా సుమారు రూ.15 కోట్లు వసూలు అయిందని, ఈ ఏడాది రూ 20 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పని చేయాలన్నారు. నీటి పన్నుకు సంబంధించి ప్రస్తుత పాత, బకాయిలు వసూలు చేసేందుకు సచివాలయాల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా సచివాలయాల అడ్మిన్లు, ఎమినిటీ కార్యదర్శులు, ఎఇలు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్లతో ఏర్పాటయ్యే బృందాలు నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఆదేశించారు. సమావేశంలో వాటర్ వర్క్స్ డిఇ ప్రభాకర్, ఆర్‌ఐలు చెక్కా రమణ, నిర్మలా కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
- కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలన
అధునాతన వసతులతో విశాల ప్రాంగణంలో చేపట్టిన కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనులను కార్పొరేషన్ కమిషనర్ మహేష్ కుమార్ రావిరాల బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రగతిని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నాలుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తున్నట్లు స్మార్ట్ సిటీ ఎస్‌ఈ వెంకట్రావు కమిషనర్ కు వివరించారు. నూతన భవనానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్ నమూనాను కమిషనర్ పరిశీలించారు. ఆయన వెంట స్మార్ట్ సిటీ ఎస్‌ఇ పి.వెంకట్రావు, కాంట్రాక్టర్, సుధాకర ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధి వంగ పుల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న నగరపాలక కమిషనర్ మహేష్ కుమార్










