Feb 08,2023 22:53

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే ఆస్తులను జప్తుచేసేందుకు సైతం వెనుకాడబోమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్‌ భవానీప్రసాద్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో పన్ను ఎగవేతదారుల జాబితాను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి, కమిషనర్‌ భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ పన్ను బకాయిదారులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. రూ50 వేలకు పైబడిన మొండి బకాయిదారుల జాబితాను ప్రకటించారు. పట్టణంలో ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యా, వ్యాపార సంస్థల ప్రతినిధులు సుమారు వందమంది వరకూ రూ.రెండు కోట్లకు పైగా పన్నులు కట్టాల్సి ఉందని తెలిపారు. ఇతరులు మొత్తం రూ.9 కోట్లు మున్సిపాలిటీకి బకాయి ఉన్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో ఏడు వేల కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, వాటిలో పట్టణంలో 1600 అక్రమ కుళాయి కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి పన్ను చెల్లించాలని కోరామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి, పారిశుధ్య నిర్వహణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానమని తెలిపారు. పన్ను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మొండిబకాయిదారులపై చేపట్టే చర్యల్లో భాగంగా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.