ప్రజాశక్తి - కలెక్టరేట్
జివిఎంసి విధించిన చెత్త సేకరణ పన్ను, ఆస్తి ఆధారిత ఇంటి పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద వార్వా, నివాస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్వా ప్రధాన కార్యదర్శి బిబి.గణేష్, నివాస్ ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణ మూర్తి, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్నులు నుంచి ఆస్తి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పద్ధతికి మార్చడం సరికాదన్నారు. లైబ్రరీ సదుపాయాలను ప్రజలకు అందించకుండా, లైబ్రరీ సెస్సు వసూలు చేసి జివిఎంసి దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కన్సర్వెన్సీ పన్ను వసూలు చేస్తూనే అదనంగా చెత్త సేకరణ పన్ను వసూలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. అడ్డగోలుగా అనధికార పెనాల్టీలు విధించడం వంటి అనుచిత నిర్ణయాలను సవాలు చేస్తూ వార్వా, నివాస్‌లు వేరువేరుగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టులో వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల్లో న్యాయం తేలే వరకు పెంచిన ఆస్తి పన్ను, చెత్త సేకరణ పన్నుల వసూళ్లను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.ప్రకాశరావు, సిహెచ్‌ఎల్‌ఎన్.శాస్త్రి, జెపి.శర్మ, కెవి.రమణమూర్తి, తులసీరామ్, కుమార్ మంగళం తదితరులు పాల్గొన్నారు. జివిఎంసి మేయర్, కమిషనర్లకు మెయిల్ ద్వారా వినతి పత్రాలు పంపించారు.










