ప్రజాశక్తి-గుంటూరు : జిఎంసికి రావాల్సిన నీటి మీటర్ల చార్జీలు, కుళాయి చార్జీల బకాయిలను వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగర ఇన్‌ఛార్జి కమిషనర్ పివికె.భాస్కర్ తెలిపారు. గురువారం జిఎంసి కౌన్సిల్ హాల్లో నీటి మీటర్ల చార్జీల వసూళ్ళపై ఆర్‌ఒ, ఆర్‌ఐలు, డిఇఇలు, ఎఇలు, ఎమినిటి, అడ్మిన్ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి పన్ను సుమారు రూ.55 కోట్ల బకాయిలు ఉండగా ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. బకాయిల వసూళ్లలో ఎమినిటి, అడ్మిన్ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎమినిటీ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలోని బకాయిల జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని, అడ్మిన్ కార్యదర్శుల సహకారంతో వసూళ్లు చేయాలని ఆదేశించారు. కొన్ని సచివాలయాల పరిధిలో మొండి బకాయిలున్న వారి జాబితా తీసుకొని, బకాయిదార్లకు తెలియచేయాలని, స్పందించని వారికి కుళాయి తొలగింపునకు రెడ్ నోటీసులు జారీ చేయాలని అన్నారు. డిఈఈలు, ఆర్‌ఓలతో సమన్వయం చేసుకొని బకాయి వసూళ్లు చేయాలని, బకాయిలు చెల్లించని వారి ట్యాప్‌ల తొలగింపుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్తి పన్ను వసూళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు. మార్చి వరకు వేచి చూడకుండ ఈ నెల నుండే వసూళ్లకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఇన్‌ఛార్జి అదనపు కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, ఆర్.ఓ.లు బాలాజీ బాష, రెహమాన్, సాంబశివరావు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కమిషర్ భాస్కర్