May 30,2023 01:18
పైపు లైను వేయాలంటున్నది ఈ పాఠశాలకే!

ప్రజాశక్తి-చీరాల: అడవి పండింది, కాకులు తిన్నాయి అన్న చందంగా తయారైంది మున్సిపల్‌ అధికారుల పరిస్థితి చూస్తుంటే.. ప్రజల సొమ్మును కాపాడాల్సిన పాలకవర్గమే వాటిని దుర్వినియోగపరిచే విధంగా నిధులను అనధికారికంగా ఇష్టారీతిగా ఖర్చు చేస్తూ ప్రజల సొమ్మును గండి కొడుతున్నారు. ఓవైపు మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించి షాపులు నిర్మిస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లు చోద్యం చూస్తుండటం మరోవైపు పన్నేలేని ఓ ప్రైవేటు ఫ్రైడ్‌ స్కూలుకు రూ.10 లక్షల వ్యయంతో పైపులైను నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఇందుకు నిదర్శనంగా మారింది. చీరాల కారంచేడు రహదారిలో ప్రైడ్‌ ప్రైవేట్‌ స్కూలుకు తాగునీటి సరఫరా చేసేందుకు చీరాల పురపాలక సంఘం రూ.10 లక్షలు ప్రజాధనం కైంకర్యం చేయడానికి రంగం సిద్ధమైంది. గత రెండు మూడు సమావేశాల అజెండాలో ఈ విషయాన్ని పదేపదే మున్సిపల్‌ చైర్మన్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకురావడం, ఈ విషయమై బహిరంగంగా చర్చలు జరగడం వాయిదా వేయడం జరుగుతోంది. మంగళవారం జరగనున్న సాధారణ సమావేశంలో సదరు ప్రైవేటు స్కూలుకు తాగునీటి సరఫరా పేరుతో పురపాలక సంఘం ప్రజాధనం కేటాయించడానికి రంగం సిద్ధమైనట్లు ఆరోపణలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ సమావేశం తాలూకు అజెండా కాపీలను కౌన్సిల్‌ సభ్యులకు చైర్మన్‌ అందజేయడం జరిగింది.సాగర్‌ అజెండాలో మూడవ అంశముగా కారంచేడు రోడ్డు లోని ప్రైడ్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు యాజమాన్యం అభ్యర్థన మేరకు పైపులైను నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు కొరకు కౌన్సిల్‌ దష్టికి తీసుకు వెళుతున్నట్టు స్పష్టమైంది. ప్రభుత్వ పాఠశాలలకు ఏమాత్రం సహకారం అందించని మున్సిపల్‌ అధికారులు ప్రైవేటు స్కూలు ప్రయోజనాల కోసం ప్రజాధనం కేటాయించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.అయితే 10 లక్షల వ్యయంతో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ స్కూలుకు పైపులను వేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడు కౌన్సిల్‌ సమావేశం జరగనున్న తరుణంలో కౌన్సిలర్లు ఆమోదిస్తారా? లేక ప్రజాధనం వృథా కాకుండా వాటిని సంరక్షించే దిశలో వ్యతిరేకిస్తారా? వేచి చూడాలి.