ప్రజాశక్తి-సత్తెనపల్లి : మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వ్యంలో మంగళవారం పలు పట్టణాల్లోని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించారు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుటే బైటాయించారు. కార్యాలయంలోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వాగ్వాదం తెలెత్తింది. పలువురి కార్మికుల్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్‌కు తరలించారు.
తొలుత కార్మికుల ఆందోళనకు సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, సిఐటియు పట్టణ నాయకులు ఎం.జగన్నాథరావు, జె.రాజకుమార్ సంఘీభావం తెలిపారు. యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలలు ఇవ్వాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలో మున్సిపల్ కార్యాలయం అధికారులు విధులకు హాజరయ్యేందుకు రావడంతో కార్మికులు వారిని కార్యాలయంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. పట్టణ సిఐ యు.శోభన్‌బాబు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనను విరమించాలని కోరారు. కార్మికులు ఇందుకు తిరస్కరించడంతో పోలీసులు, కార్మికులకు వాగ్వాదం తలెత్తింది. అనంతరం నాయకులు రాజకుమార్, యూనియన్ అధ్యక్షులు చింతగుంట్ల పెద్ద వెంకయ్య, దాసరి చినకొండా, పెదాల సాంబశివరావు, తుమ్మలకుంట రమేష్‌ను పోలీసులు లాక్కెళ్ళి జీపులో ఎక్కించారు. అనంతరం మిగతా కార్మికులను కూడా పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని ఆందోళనకు దిగడంతో వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.శివ దుర్గారావు, షేక్ సైదులు, జె.నాగమణి, డి.కొండ పాల్గొన్నారు.
అరెస్టులకు సిపిఎం, సిఐటియు ఖండన
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను, మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులను అరెస్టు చేయడం అక్రమమని సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ ఖండించింది. ఈ మేరకు స్థానిక పుతుంబాక భవన్లో విలేకర్లతో సిపిఎం పట్టణ కార్యదర్శి విమల మాట్లాడారు. గత నెలలో 21, 22 తేదీల్లో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ముట్టడి కార్యక్రమం చేపట్టారన్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. సమావేశంలో శివదుర్గారావు, రాజకుమార్, సైదులు, గద్దె ఉమశ్రీు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అరెస్టులను సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ ఖండించింది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయనాయక్ విలేకర్లతో మాట్లాడారు. నాయకులు టి.శ్రీనివాస రావు, కె.సీతారామయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే కలెక్టరేట్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాల ముట్టడికి కార్మికులు సిద్ధమువుతారని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ముట్టడికి ఆయన మద్దతుగా మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రాలేని పరిస్థితులలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేశారని గుర్తు చేశారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18500 జీతం ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి కార్మికులకు నష్టదాయకమైన ఆప్కాస్ విధానాన్ని కార్మికులపై బలవంతంగా రుద్దారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం రోడ్డుపై వంటా చేపట్టారు. ఆందోళనకు పిడిఎం నాయకులు ఎన్.రామా రావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కె.ఏడుకొండలు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిలార్ మసూద్ సంఘీభావం తెలిపారు. మున్సిపల్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరారపు సాల్మన్, నరసరావుపేట మున్సి పల్ అధ్యక్ష, కార్యదర్శులు టి.మల్లj ు్య, పి.ఏసు, వీరకుమార్, కె.ప్రసాద్, సాల్మన్, నరసింహా రావు, ఇశ్రాయేలు, హుస్సేనమ్మ ,విజయలక్ష్మి, శ్రీను పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టగా సిఐటియు డివిజనల్ కార్యదర్శి బండ్ల మహేష్ మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.లక్ష జీతం ఇచ్చినా తక్కువేనని, అమ్మ కూడ చేయలేని పనులు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారని అన్నారు. 010 పద్దు ద్వారా వీరందరికి వేతనాలు ఇవ్వాలన్నారు. నాయకులు ఎన్.లక్ష్మయ్య, కె.రమణ, సిహెచ్ సాగర్‌బాబు, కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు పోరాడుతున్నా సిఎంకు కనికరం లేదన్నారు. అధికారానికి రాకముందు హామీలిచ్చిన ఆయన వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, 17న చలో విజయవాడ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో కార్మికులు కె.సీతారామయ్య, కొండలు, ప్రతాప్, రామారావు, సురేంద్ర, అనిల్, వెంకటేశ్వర్లు, శ్యామ్ కోటి, వీరమ్మ అనంతలక్ష్మి, కృష్ణవేణి, మార్తమ్మ, జయేంద్ర, డి.లక్ష్మి, రైతు సంఘం నాయకులు బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.










