Oct 09,2023 00:30

పనిచేయని రేషన్‌ సర్వర్లు

పనిచేయని రేషన్‌ సర్వర్లు
నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా
రెండు రోజులుగా పడికాపులు
అవస్థలు పడుతున్న కార్డుదారులు
ప్రజాశక్తి- సోమల:
మండల కేంద్రమైన సోమలలోని రామాలయం పక్కనున్న చౌకదుకాణ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం నుండి సాయంత్రం ఏడు వరకు నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వర్‌ సమస్యతో ఈపాస్‌ మిషన్‌ పనిచేయకపోవడం తదితర సమస్యలతో కార్డుదారులు చౌక దుకాణం వద్ద పడిగాపులు ఉన్న పరిస్థితి కనిపించింది. కొంత సమయం మాత్రమే మిషన్‌ పనిచేయడంతో ఒకరిద్దరికి మాత్రమే సరుకులు ఇచ్చారు. ఆ తర్వాత ఈపాస్‌ మిషన్‌ మోరాయించడంతో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, తాము కూలి పనులను కూడా వదులుకొని నిత్యావసర సరుకుల కోసం వస్తే ఇక్కడ సర్వర్‌ సమస్య మిషన్‌ పనిచేయకపోవడం కారణంగా వట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలో అన్ని చౌకదుకాణాలలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కార్డుదారులు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించి త్వరితగతిన కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.