ప్రజాశక్తి-మార్టూరు రూరల్: వస్త్ర వ్యాపారం కారణంగా చిన ముంబయిగా పేరుగాంచిన వలపర్లలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎం ద్వారా స్థానికులతో బాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులు నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుపుతుంటారు. అటువంటి ఏటీఎం కేంద్రం గత కొద్ది రోజులుగా పనిచేయక.. బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళితే పట్టించుకోక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వలపర్ల గ్రామస్తులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలోని వలపర్ల గ్రామంలో స్కేల్ 4 బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంకు ఆవరణలో ఉన్న ఎటిఎంలో కొద్ది రోజులుగా ఖాతాదారులు ఎదుర్కొంటున్న వింత పరిస్థితి ఇది.. ప్రతి ఒక్కరూ ఏటీఎంలోకి రావడం, మిషన్‌లో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగిపోవడం నిత్యకృత్యమైంది. గత కొద్దిరోజులుగా ఖాతాదారులు ఈ సమస్యపై బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏటీఎం కేంద్రంలో మిషన్లు పనిచేయని విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియక బ్యాంకు ఖాతాదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి ఏటీఎం మిషన్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వలపర్ల స్టేట్ బ్యాంక్ ఆవరణలో ఉన్న ఏటీఎం మిషన్లు పని చేయని విషయాన్ని ప్రజాశక్తి బ్యాంకు చీఫ్ మేనేజర్ డి నరేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.
ఏటీఎం మిషన్లు మార్చాలి
షేక్ జాఫర్ అలీ, వైసిపి నాయకులు వలపర్ల
వ్యాపార రంగానికి ప్రసిద్ధి గాంచిన వలపర్ల గ్రామంలో నిత్యం అనేకమంది నగదు లావాదేవీలు జరుపుతుంటారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఎస్‌బిఐ ఏటీఎం కేంద్రంలో మిషన్లు పనిచేయకపోవడంతో ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు సిబ్బంది కనీస సమాచారం ఇవ్వడంలేదు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం కేంద్రంలోని మిషన్లు మార్చి వాటి స్థానంలో కొత్తవి బిగించేలా చర్యలు తీసుకోవాలి.
సమస్యను త్వరలో పరిష్కరిస్తాం
డి నరేష్, చీఫ్ మేనేజర్, ఎస్‌బిఐ, వలపర్ల
వలపర్ల స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఏటీఎం కేంద్రంలోని మిషన్లు సాంకేతిక లోపం వల్ల కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. ఈ సమస్యను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్టేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రాలకు సర్వీస్ అందించే ఏజెన్సీకి సమాచారం అందించాం. త్వరలో పాత మిషన్లు తొలగించి వాటి స్థానంలో కొత్త ఏటీఎం మిషన్లు ఏజెన్సీ ద్వారా బిగించేలా చర్యలు తీసుకుంటాను.










