ప్రజాశక్తి-మంగళగిరి : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటంలో ఆశ వర్కర్లందరూ భాగస్వాములవ్వాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మి పిలుపునిచ్చారు. ఆశ వర్కర్ల ప్రాంతీయ సదస్సు స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కె.లకీë మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్లకు తీవ్రమైన పని భారం మోపిందని, సెల్ ఫోన్లలో ఆన్లైన్ పని చేయాలని ఆదేశాలు ఇచ్చారని, పని చేయలేని వారిని మానుకోమ్మని బెదిరిస్తున్నారని అన్నారు. ఆశ వర్కర్లతో అధికారులు వెట్టిచాకిరి చేయిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ కనీస వేతనం కూడా లేని ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటిని రద్దు చేశారని అన్నారు. సంక్షేమ పథకాల వర్తింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ వయస్సు పెంపు, సెలవులు తదితర సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు ఆశ వర్కర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటి యు మంగళగిరి పట్టణ కార్యదర్శి కమలా కర్ మాట్లాడుతూ పోరాడనిదే సమ్యలను ఏ ప్రభుత్వమూ పరిష్కరించదని చెప్పారు. సదస్సులో యూనియన్ నాయకులు కుమారి, స్వర్ణకుమారి, వాణి పాల్గొన్నారు.










