Aug 18,2023 21:59

ధర్నా చేస్తున్న ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు

* డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల నిరసన
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిఒ నంబరు 117 ఆధారంగా చేస్తున్న పని సర్దుబాటును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్‌, సెక్రటరీ జనరల్‌ కె.అప్పలరాజు మాట్లాడుతూ బదిలీలు, ఉద్యోగోన్నతులు, రీఅపోర్షన్‌మెంట్‌ జరిగిన ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆన్యాయమన్నారు. అధికారంలోకి రాక ముందు సిపిఎస్‌ను రద్దు చేస్తానని నమ్మించి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. ఉపాధ్యాయులను తీవ్రమైన పనిఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. విద్యార్థులతో బలవంతంగా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయించడం మానుకోవాలన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ బి.నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర, జి.గిరిధర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పొందూరు అప్పారావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌, ఎపిటిఎఫ్‌ (1938) జిల్లా ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి రమణ, డిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.