ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఉపాధ్యాయుల పని సర్దుబాటును తక్షణమే నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న పని సర్దుబాటు ప్రక్రియను ఎంఇఒలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఉప విద్యాశాఖాధికారులు మాత్రమే సీనియార్టీ జాబితాలు తయారు చేసి పని సర్దుబాటును చేయాల్సిన ఉన్నా, ఎంఇఒలే ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులను డ్రాప్ బాక్స్‌లో పెట్టని కారణంగా గత నెల 31వ తేదీ నాటికి అక్కడ రోల్ తక్కువగా చూపడంతో కొన్ని పోస్టులు అదనంగా ఉన్నట్లు ఎంఇఒలు చెప్తున్నారని తెలిపారు. డిఇఒ, డిప్యూటీ డిఇఒ, ఎంఇఒల మధ్య సమన్వయం లేకపోవడంతో ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. పని సర్దుబాటును కొనసాగిస్తే సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా కొంతమంది ఉపాధ్యాయులకు నేటివరకు జీతాలు చెల్లించడం లేదని, మళ్లీ ఇప్పుడు పని సర్దుబాటు పేరుతో వేరే పాఠశాలలకు పంపించడం సరికాదన్నారు. సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్, ఎపిటిఎఫ్ (257) నాయకులు మజ్జి మదన్మోహన్, డిటిఎఫ్ నాయకులు పేడాడ కృష్ణారావు, పూజారి హరిప్రసన్న, ఎపిటిఎఫ్ (1938) నాయకులు టి.చలపతిరావు, ఎస్‌టియు నాయకులు పి.తమ్మినాయుడు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.










