Aug 02,2023 21:33

పని సర్దుబాటు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి : యుటిఎఫ్‌

రాయచోటి : అసంబద్ధ పని సర్ధుబాటు ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబీర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వారు డిఇఒ కార్యాలయంలో ఎడి ప్రసాద్‌బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉర్దూ తిమ్మసముద్రంలో ఉన్న ఏకైక తెలుగు ఉపాధ్యాయురాలిని రాయచోటి పట్టణ సమీపంలోని గరుగుపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేయడం, చిట్వేలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియం బోధించే ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిని రాజంపేట పట్టణంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారని, తెలుగు మీడియం వారు ఉర్దూ మీడియంలో ఎలా బోధిస్తారు అర్థం కాని విషయం అని అన్నారు. ఆర్‌. రాచపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి విద్యార్థులుండగా అక్కడ నుంచి ఒక ఇంగ్లీషు, ఒక లెక్కల ఉపాధ్యాయులను కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేయడంతో ఆర్‌.రాచపల్లిలో ఉన్న సింగిల్‌ ఇంగ్లీషు, గణిత ఉపాధ్యాయులు 8 తరగతులకు ఎలా నాణ్యమైన విద్యను అందిస్తారని ప్రశ్నించారు. పెనగలూరు మండలంలోని కొండూరు ఉన్నత పాఠశాలలో 8 తరగతులకు గాను అంధ ఉపాధ్యాయుడు, మరొకరు ప్రధానోపాధ్యాయులు ఆంగ్ల బోధిస్తున్నారని, వారిలో ప్రధానోపాధ్యాయులను రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సర్దబాటు చేయడంతో 8 తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని పేర్కొన్నారు. వెంటనే సదరు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌ రెమ్యునేషన్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చెల్లించినప్పటికీ జిల్లాలో అరకొరగా రెమ్యునరేషన్‌ చెల్లించడం దారుణమని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌.సురేంద్ర రెడ్డి, రాయచోటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, హఫీజుల్లా, రాజా రమేష్‌ వీరబల్లి మండల ప్రధాన కార్యదర్శి అమీనుల్లా, రఫీ పాల్గొన్నారుఎఒకు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు