
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలోని సచివాలయాల్లో విధులను సరళంగా నిర్వహించేందుకు అనుగుణంగా పని సర్దుబాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది రేషన్‌లైజేషన్‌పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లోని సచివాలయాల్లోని సిబ్బంది ఇటీవల జరిగిన బదిలీల కారణంగా తగ్గడం జరిగిందన్నారు. సంబంధిత సచివాలయాలను గుర్తించి విధులు సరళంగా నిర్వహించేందుకు అనుగుణంగా సచివాలయం నుంచి పని సర్దుబాటు కింద అవసరమైన ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులు జాబితాలను సిద్ధం చేసుకుని, సిబ్బంది కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి కెసిహెచ్.అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి జివికె.మల్లికార్జునరావు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి, ఇన్‌ఛార్జి డిఎల్‌డిఒ కె.వాణి పాల్గొన్నారు.