పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి.
ఉపాధి ఫేస్ యాప్ రద్దు చేయాలి..
ఉపాధి హామీకీ బడ్జెట్ పెంచాలి
వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో త్రాగు నీరు, మజ్జిగ, విడిదికి టెంట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ సవరించి వారి సమస్యలు పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి పతనం తప్పదని ఆమె హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా లోని ఉపాధి కూలీలు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా వ్య కా స రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ లు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తక్కువ బడ్జెట్ కేటాయించి గ్రామీణ పేదలకు చట్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.ఇదే జరిగితే బిజెపి ప్రభుత్వానికి పతనం తప్ప దని హెచ్చరించారు.కొత్తగా ఫోటో యాప్ ను తేవడం వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నరన్నారు. గతంలో ఉన్న మౌలిక సదుపాయాలు టెంటు సౌకర్యం, మంచినీళ్లు ,మజ్జిగ ,మెడికల్ ,బీమా పథకం, పనిముట్లు, సమ్మర్ అలవెన్సు ,మేటీలకు అలవెన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా చేసిందని కేంద్రం పైన మండిపడ్డారు.కూలీలు పనిచేసే చోట సౌకర్యం లేకపోవడంతో ఎండ తీవ్రతకు తలలేక అక్కడికక్కడే మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికీ జిల్లాలో ఆరు మంది మరణించారని కానీ వారికి ఎటువంటి నష్టపరిహారం ప్రకటించలేదని గుర్తు చేశారు.చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పాత విధానాన్ని కొనసాగించి ఫోటో యాప్ ఎత్తివేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా సందర్భంగా అక్కడికి వచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్ర రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. పీడీ స్పందిస్తూ తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని మిగతా సమస్యలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈశ్వరయ్య ,డేవిడ్, నరసింహ నాయక్ ,పకీర, బాలయ్య, ఓబులేసు, బంగారం, రత్తమయ్య, కృష్ణ ,సుబ్బరాయుడు ,రైతు సంఘం జిల్లా నాయకులు నరసింహ ,రామచంద్రుడు మరియు జిల్లా వ్యాప్తంగా 500 మంది ఉపాధి కూలీలు పాల్గొన్నారు.










