- శ్రామిక మహిళల సమస్యలపై స్పందనలో జెసికి వినతి
ప్రజాశక్తి-విజయవాడ: పని ప్రదేశాల్లో వేధింపుల నివారణకు కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎ.కమల కోరారు. ఆ మేరకు ఆమె శ్రామిక మహిళా నాయకులతో కలిసి ఎన్‌టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ బి.సంపత్‌కుమార్‌కు స్పందన కార్యక్రమంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు మహిళల జీవితంలో అంతర్భాగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం 2013 లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని నేటి ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు నోడల్ ఆఫీసర్లను నియమించడం లేదని, అంతర్గత కమిటీలు లేవని, ఎక్కడైనా ఉన్నా అవి నామమాత్రంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల్లో వివిధ పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్స్‌లో శ్రామిక మహిళలు పనిచేస్తున్న ప్రదేశాలలో అన్ని స్థాయిల్లో కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసి, లైంగిక వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళలకు కనీస వేతనాలు, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మంచినీళ్లు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, క్రేచ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పి.శ్రీలక్ష్మి, ఇ.దుర్గాలక్ష్మి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి.కుమారి, మధ్యాహ్న భోజనం యూనియన్ నాయకులు వై.ఉమా, గవర్నమెంట్ హాస్పటల్స్ స్విపర్స్ యూనియన్ నాయకులు ఎస్‌కె రేష్మ తదితరులు పాల్గొన్నారు.










