నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయడం. వారి శారీరక, మానసిక శక్తిని ఉపయోగించుకోవడం. 'నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి' అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి, సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆ దేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కారణం. 'నేటి భారతదేశం' అనే పుస్తకంలో రజనీ పామేదత్ చెప్పినట్లుగా ఒక మనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞానాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదారులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరులు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్‌లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగులుగా చేసి రోబోట్ వంటి యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ విధాన సహజ లక్షణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆ సౌకర్యం ప్రజలకు కల్పించి, పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసాయన కంపెనీల్లో కూడా రోజుకు 8 నుంచి 12 గంటలు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటువంటి పరిశ్రమల్లో వారానికి ఐదు రోజులు, రోజుకు ఆరు గంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021 జూన్ 26 నాటికి 3.94 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మరణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో నిరుద్యోగ సమస్యను 20 ఏళ్లలో పరిష్కరించాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసాగుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. 'లియాంటివ్' అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి.
సోషలిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో 'పని హక్కు' ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పిస్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటు హక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒక ప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143 కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా, వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ, 5 శాతం కో ఆపరేటివ్ రంగం లోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యాతో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991 తరువాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్, గ్రీస్ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9 శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వరంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయినా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతి తక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 18న జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ, వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్‌టిసి పర్మినెంట్ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన 6,03,756 ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 3,99,791 మంది వున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగుల భర్తీలో చూపడం అన్యాయం.
మున్సిపల్, విద్యుత్ రంగాల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను...ఎ.పి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్ కార్మికులుగా చూపించడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్‌లో ప్రకటించలేదు. ఆ ఖాళీలు హుష్ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వే లోని లక్షలాది ఖాళీ ఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పై ఉద్యోగాలన్నీ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు.
నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్కరించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్ యూనియన్లు పోరాడుతున్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకులందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ, యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
సిహెచ్. నర్సింగరావు











