ప్రజాశక్తి-కాకినాడ పని భారం తగ్గించాలని ఎపి యునైటెడ్ విలేజ్ అండ్ వార్డు హెల్త్ సెక్రెటరీస్ వెల్ఫైర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. మూడేళ్లు సర్వీస్ పుర్తిచేసిన హెల్త్ సెక్రెటరీలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 80 రకాల మొబైల్స్ యాప్స్ పని భారాన్ని తగ్గించాలని, క్షేత్రస్థాయి ఎఎన్‌ఎంలకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయించాలని, 3 వేల జనాభాకు ఒక ఎఎన్‌ఎంను నియమించాలని, అధికారులు వేసే సమావేశాలు సమన్వయంతో డ్యూటీ సమయంలో వేయాలని, ట్రాన్స్‌ఫర్స్ ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఈ ధర్నా శిబిరాన్ని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రత్నరాజు ప్రారంభించారు. ధర్నా అనంతరం జెసికి వినతిపత్రం అందించారు. ఈ ధర్నాల్లో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రాష్ట్ర కార్యదర్శి ప్రభారాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ సెక్రటరీలకు 2022 పిఆర్‌సి ప్రకారం రెగ్యులర్ ఎఎన్‌ఎంతో సమానంగా వేతనాలు, లీవులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు 80 రకాల యాప్‌లలో డేటాను అప్లోడ్ చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు నాణ్యత లేక ఇబ్బందులు ఎదురవుతుంటే అధికారులు మాత్రం ఎఎన్‌ఎంలను బాధ్యులను చేస్తూ మెమోలు ఇస్తున్నారని విమర్శించారు. తక్షణం యాప్‌ల పనిభారాన్ని తగ్గించి నాణ్యమైన ట్యాబ్లను ఇవ్వాలని కోరారు. సచివాలయ హెల్త్ సెక్రెటరీలకు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు మూడేళ్లు సర్వీస్ దాటిన వారిని గ్రేడ్ 3 నుంచి మెరిట్ ప్రాతిపదికన ప్రమోట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి.వరలక్ష్మి, జ్యోతి, రాణి, చీకట్ల శ్రీనివాస్, స్వామి, ఎండి. ఇబ్రహీం, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, 108 ఉద్యోగుల నేతలు, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు పాల్గొన్నారు.










