ప్రజాశక్తి-కుందుర్పి వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీమాజ్జనపల్లిలో ఎండుతున్న వేరుశనగ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేయాలంటే కనిష్టంగా రూ.30 వేలు ఖర్చవుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు పూర్తిగా ఎండుదశకు చేరుకున్నాయన్నారు. పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత టిడిపి హయాంలో వర్షాలు కురవకపోవడంతో రెయిన్ గన్‌లు అందజేసి పంటలు కాపాడామని గుర్తు చేశారు. ఆ దిశగా వైసిపి ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ధనుంజయ, సత్తి, నాగరాజు, ఆనంద, గ్రామస్తులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎండుతున్న వేరుశనగ పంటను పరిశీలిస్తున్న టిడిపి ఇన్‌ఛార్జి ఉమా మహేశ్వరనాయుడు, రైతులు










