Oct 19,2023 20:29

టమోటా పంటను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌
ప్రజాశక్తి - ప్యాపిలి

    రాష్ట్రంలో పంటలు వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం కింద ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ప్యాపిలి మండలంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి అయోమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వలసలుగా ఇతర రాష్ట్రాలకి సాగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని చెప్పారు. ఎమ్మిగనూరులో జరిగిన సిఎం బహిరంగ సభలో రైతులను ఆదుకుంటారని, హామీ ఇస్తారని ఆశించినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల ఆయన వైఖరి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. డోన్‌ నియోజవర్గంలో 106 చెరువులకు నీళ్లు నింపకుండా కేవలం ప్రారంభోత్సవాల ప్రచారానికే పరిమితం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులను కలుపుకొని రాష్ట్రంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రిని తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్‌, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, మోటార్‌ రాముడు, ఏఐఫ్‌వైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్‌, జిల్లా కోశాధికారి సురేష్‌, మండల కార్యదర్శి వెంకటేష్‌, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.