Mar 02,2023 22:28

ప్రజాశక్తి-మైలవరం, ఎ.కొండూరు, గంపలగూడెం
జమలాపురం, మైలవరం మేజర్‌లకు సాగర్‌ జలాలు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం, జమలాపురం మేజర్‌ల కు వెంటనే సాగర్‌ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మైలవరం మేజర్‌ ఎన్‌ఎస్‌పి కాలువ, ఎ.కొండూరు తండా, జమలాపురం మేజర్‌ కాలువలను గురువారం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పెట్టుబడులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. సకాలంలో సాగర్‌ జలాలను అందించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. పంటలు ఎండిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. గత మూడు సంవత్సరాలుగా నీరు వదలకపోవడం వల్ల జమలాపురం మేజర్‌ కాలువ పరిధిలో ఉన్న పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని ముచ్చెనపల్లి, ఎ.కొండూరు తండా, కనుమూరు, అనుములలంక, వినగడప గ్రామాలకు చెందిన రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకుడు శనగల రామకృష్ణారెడ్డి, వజ్రాల వెంకటరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పానెం ఆనందరావు, రైతు సంఘం ఎ.కొండూరు మండల కార్యదర్శి ఆళ్ల అమ్మిరెడ్డి, పంబి వెంకటేశ్వరరావు, సోమ యోహాను, సిఐటియు ఎ.కొండూరు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.