Oct 17,2023 22:33

ప్రజాశక్తి- సోమల:
సోమల మండలం బోనమంద గ్రామం ఎర్రకుంట సమీపంలోని గార్గేయ నది ఒడ్డున ఉన్న పలువురి రైతుల పంట పొలాలపై ఏనుగుల మంద దాడి చేసి వరి, మామిడి, అరటి పంటలకు నష్టం కలిగించినట్టు రైతులు తెలిపారు. సోమవారం రాత్రి 12 ఏనుగుల గుంపు శ్రీనివాసులు, భాస్కర్‌, నారాయణ, నరసింహులుకు చెందిన వరి, అరటి, మామిడి పంట పొలాలపై దాడి చేసి అరటి, మామిడి కొమ్మలను విరిచి వేశాయి. వరి పొలాలలో విచ్చలవిడిగా తిరుగాడి పంటలకు నష్టం కలిగించినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగుల మంద వరిపై దాడి చేశాయని, పంట సాగుకు అప్పులు చేసి ఖర్చు పెట్టామని ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అటవీ శాఖ వారు ఏనుగుల కదలికలను గుర్తించి రైతులకు సకాలంలో సమాచారం అందిస్తే తాము కూడా అధికారులకు సహాయ సహకారాలు అందించి ఏనుగుల మందను ఇటువైపు రాకుండా చూసేవారమని తెలిపారు. అటవీశాఖ వారు ఏనుగుల కదలికలపై దష్టి పెట్టకపోవడంతో తమకు తీవ్రంగా నష్టం కలిగిందని వారు వాపోతున్నారు. మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు జరిగిన పంట నష్టాన్ని గుర్తించి తమకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.