ప్రజాశక్తి - రామకుప్పం
మండల పరిధిలోని పంద్యల మడుగు పంచాయతీ గొల్లపల్లి గ్రామం లో పంట పొలాల పై ఏనుగులు స్యైర విహారం చేశాయి. గురువారం రాత్రి గంట్లప్ప, బాబు అనే రైతులకు చెందిన వరి, అరటి తోటలను తీవ్రం గా నష్ట పరిచాయి. మూడు ఏనుగుల గుంపు కోతకు వచ్చిన పంటలను తిన్నంత తిని.. తొక్కి నాశనం చేసి పోవటం తో చేసేది లేక బాధిత రైతులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతంలోనీ గ్రామాల వైపు తరచూ ఏనుగులు పంటలు నాశనం చేస్తూ... రైతులని మరింత అప్పుల ఊబి లోకి నెట్టేస్తున్నా ... ప్రభుత్వ యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపక పోవటం కొసమెరుపు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్నో సార్లు అధికార్లు కు రైతులు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు. అదే విధంగా అడవుల్లో జంతువులకు నీరు, ఆహారం సంవద్ది గా లభించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ... జంతువులు అడవిని దాటి గ్రామాల వైపు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడవుల్లో ఆహారం లభించక... ఆహార అన్వేషణలో భాగంగా ఏనుగులు గ్రామాల పై పడుతున్నాయి. చీకటి పడితే పొలాల వైపు వెళ్ళాలంటే అటవీ సమీప రైతులు హడలిపోతున్నారు . ముఖ్యంగా అటవీ సరిహద్దు ప్రాంతం చుట్టూ అసం పూర్తిగా ఉన్న కంద కాలను పూర్తి చేసి... సోలార్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.










