Nov 21,2023 00:02

ప్రజాశక్తి- వికోట: వికోట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయకొండప్పకు చెందిన రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున 15 ఏనుగులు గ్రామ చివారున ఉన్న వంటి పంటను తిన్నంత వరకు తిని తొక్కి ధ్వంసం చేశారు. దీని వలన సుమారు రూ.50వేలకు పైగా నష్టం వాటిల్లిందని రైతును ఆవేదన వ్యక్తం చేశారు. కోత దశలో ఉన్న పంటను తొక్కి నేలమట్టం చేశాయని వాపోయారు.
రామకుప్పం: మండల పరిధిలోని ననియాల, నారాయణపురం తాండా గ్రామ అటవీ శివార్లలోని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఆదివారం అర్ధరాత్రి కామరాజు నాయక్‌, రాఘవ నాయక్‌, గోవిందస్వామి నాయక్‌, శిన నాయక్‌లకు చెందిన వరి, రాగి, అరటి పంటలపై తిన్నంత తిని, తొక్కి నాశనం చేయడమే కాక వ్యవసాయ పరకాల కూడా ధ్వంసం చేశాయి. రైతులు రాత్రి సమయాల్లో పంటపొలాల వైపు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయ పంటలు చేస్తుంటే ఏనుగులు నాశనం చేయడంతో వేల రూపాయలతో నష్టం వాటిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు పంటలపై కి చొరబడకుండా శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం అందివ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు.
గజ దాడుల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వాడ గంగరాజు,
సిపిఎం జిల్లా కార్యదర్శి
ఏనుగుల దాడుల్లో భారీగా రైతులు నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలమనేరు, వికోట, రామకుప్పం, సోమల, సదుం, బైరెడ్డిపల్లి మండలాలు అటవీ సరిహద్దున ఉండటంతో తరచూ గ్రామాల్లోకి వచ్చి ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయన్నారు. ఏనుగులు పంటలపై దాడి చేసి కోతకొచ్చిన పంటలను నాశనం చేస్తున్నాయని, అప్పులు చేసి పండించిన పంటలను ఏనుగుల నాశనం చేయడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట పొలాల్లోకి ఏనుగులు నిత్యం గ్రామాల్లోకి చొరబడుతున్నాయని, వాటిని అరికట్టడంలో సరైన చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఇప్పటి వరకు జిల్లాలోని రైతులకు నష్టపరిహారం అందిన దాఖలాలు లేవన్నారు.