ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : పంట కాల్వలో వర్షపు నీరు బయటకు పంపేందుకు తీసిన డ్రెయినేజీ కాల్వను పున:నిర్మాణం చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లిలో రైతు సంఘం నాయకులతో కలిసి డ్రెయినేజీ కాల్వను ఆయన పరిశీలించారు. వర్షాలు కురిసినప్పుడు, పంట పొలాలలో నిలిచిన వర్షపు నీరు బయటకు పంపేందుకు తవ్విన డ్రెయినేజీ కాల్వ పూడుకుపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. తాడేపల్లి మండల పరిసర గ్రామాల్లో వాణిజ్య పంటలు పండించే రైతులు వర్షాలప్పుడు నీరు అధికంగా పొలాల్లో నిలిచి బయటికి పోయే మార్గం లేకుండా పోయిందని తెలిపారు. అరటి, పసుపు, కంద, ఆకుకూరలు వంటి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో వర్షాలు వస్తే పంటలు ముంపు బారిన పడతాయని, ఈ పరిస్థితి తలెత్తకుండా పంట కాల్వను పూడిక తీయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం మండల నాయకులు డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేసవిలో డ్రెయినేజీ కాల్వలను పూడిక తీయించే వ్యవసాయ అధికారులు కొన్నేళ్లుగా పూడిక తీయించడం లేదని అన్నారు. 2020 అక్టోబర్‌లో అధిక వర్షాలకు ప్రధాన పంటలైన అరటి, పసుపు, కంద, ఆకు కూరలు ముంపునకు గురై దెబ్బతిన్నాయని గుర్తు చేశౄరు. కుంచనపల్లి గ్రామం నుండి మెల్లంపూడి గ్రామ పరిధిలోని బకింగ్ హామ్ కెనాల్ వరకు డ్రెయినేజీ కాల్వ పూర్తిగా పూడుకుపోవడం వల్ల పంటలన్నీ దెబ్బతన్నాయని అన్నారు. 1997 ప్రాంతంలో నిమ్మగడ్డ రామ్మోహ న్‌రావు ఎమ్మె ల్యేగా ఉన్నప్పుడు డ్రెయినేజీ కాల్వ నిర్మాణం చేప ట్టారని, ప్రస్తుతం ఆ కాల్వ నిండా చెట్లు, గడ్డి విప రీతంగా పెరిగాయని తెలిపారు. పంటలను కాపా డేందుకు తక్షణమే పూడిక తీయించాలన్నారు. పరిశీలనలో రైతు సంఘం నాయకులు ఎ.రంగా రావు, పి.వీరస్వామి, ఎ.అర్జునరావు, రైతులు పాల్గొన్నారు.










