పంటలను ఇ-క్రాప్‌లో తప్పక నమోదు చేయాలి... జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ప్రజాశక్తి - విజయవాడ : ఖరీఫ్‌లో రైతాంగం చేపట్టిన వరి పంటను ఇ-క్రాప్‌లో తప్పక నమోదు చేయడంతో పాటు అధికారుల సమన్వయంతో రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఖరీఫ్‌లో పంట నమోదు, రైతుల నుండి ధాన్యం కొనుగోలు అంశాలపై శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ వివిధ శాఖల అధికారులతో డిపిసి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు 1 లక్ష 13 వేల ఎకరాలలో వరి పంటను చేపట్టే అవకాశం ఉందన్నారు. 1లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. తిరువూరు, విజయవాడ రూరల్, జగ్గయ్యపేట మండలాలలో రైతులు వరి పంటను చేపడుతున్నారన్నారు. జిల్లాలో 223 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతు తన పంటను ఇ-క్రాప్‌లో తప్పక నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఖరీఫ్ రబీ సీజన్‌లో రైతుల నుండి ధాన్యం కొనుగోలులో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సుమారు 3 లక్షల గోనె సంచులు అవసరమవుతాయని ప్రస్తుతం 1లక్ష 39 వేల గోనె సంచులు రైస్ మిల్లర్ల వద్ద సిద్దంగా ఉన్నాయన్నారు. అవసరమైతే ధాన్యం సేకరణ జరగని జిల్లాల నుండి గోనె సంచులను సరఫరా చేసేలా ఆయా జిల్లా అధికారులను సంప్రదించాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని గోడౌన్‌లకు తరలించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఖరారు చేసేలా పౌరసరఫరాల ఉన్నతాధికారులను సంప్రదించాలని చూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, హెల్పర్ ఫోస్టులను సెప్టెంబర్ 10వ తేది లోగా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిపిఎస్ ట్యాగింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.ఖరీఫ్‌లో రైతాంగం నుండి ధాన్యం సేకరించి గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా ప్రభుత్వం అశించిన లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ఆర్‌డివోలు ఆర్ రవీంద్రరావు, వైవి ప్రసన్నలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నాగమణమ్మ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, డిఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ శైలజా, రైస్ మిల్లర్ల జిల్లా అధ్యక్షులు వీరయ్య, మార్క్‌ఫడ్ డియం నాగమల్లిక, తదితరులు ఉన్నారు.










