ప్రజాశక్తి - పెదకూరపాడు : నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులోని జెడ్‌పి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 'జగనన్నకు చెబుదాం'కు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌కు వినతులిచ్చి తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. బెల్లంకొండ మండలంలోని మాచాయపాలేనికి చెందిన మూడవత్ చిన్న జగూర్ నాయక్ తదితరులు భూ సమస్యను వివరించారు. 30 ఏళ్లుగా 25 ఎకరాల అటవీ భూమిని 30 కుటుంబాల వారం సాగు చేసుకుంటున్నామని, అయితే పంటలను కందిపాడు, చండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన కొందరు ధ్వంసం చేస్తున్నారని, భూమి వారిదంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దీనిపై తహశీల్దార్, ఇతర అధికారులకు గతంలోనూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తమకు పట్టాలిచ్చి రక్షణ కల్పించాలని కోరారు. వాసిరెడ్డి భానుమతి నుండి తాను ఎడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా ఆ భూమి తమదంటూ భానమతి బంధువులు వివాదం పెట్టుకున్నారని, పొలంలోని ఏపుగా పెరిగిన పైరును ధ్వంసం చేశారని పెదకూరపాడు మండలం లగడపాడులోని కౌలురైతు షేక్ హుస్సేన్ బుడ వివరించారు. తమకు నెలకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని పెదకూరపాడు పంచాయతీలో పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు విన్నవించారు. సాగర్ నుండి అమరావతి మేజర్‌కు సాగునీరివ్వాలని పెదకూరపాడు రైతులు, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. నరసరావుపేట నుంచి అమరావతి బస్సును, నరసరావుపేట నుండి మాదిపాడు బస్సును పునరుద్ధరించాలన్నారు. వీటితోపాటు పెన్షన్, ఇళ్ల, స్థలం, ఓటరు, ఇతర వ్యక్తిగత అంశాలపై పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పరిధి దాటితే విచారణ చేయండి
ఎన్నికలకు బిఎల్‌ఒ, ఇతర సిబ్బంది ఎవరు భయపడవద్దని కలెక్టర్ చెప్పారు. బిఎల్వోలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ మరణించిన వారిని తొలగించటం, డబల్ ఎంట్రీలు గుర్తించడం, వలస వెళ్లిన వారిని గుర్తించి వారి ఓట్లను తొలగించాలన్నారు. సామాన్యులు అయిదు దరఖాస్తు వరకు అప్లై చేసుకోవచ్చని, బిఎల్‌ఒలు ఒక్కొక్కరు 10 దరఖాస్తుల వరకు ఒకేసారి ఇవ్వొచ్చని చెప్పారు. పరిధి దాటి ఇచ్చిన వారిని విచారించి తప్పుడు సమాచారమైతే కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిదీ చట్టబద్ధంగా మాత్రమే చేయాలన్నారు.










