
పంటలన్నీ ఎండిపోయే..
- కన్నీరు పెడుతున్న రైతులు
- పెట్టుబడి మట్టిపాలు
- 90 శాతం దెబ్బతిన్న వైనం
- అప్పుల ఊబిలో అన్నదాత
- గ్రామాలను వెంటాడుతున్న కరువు
ప్రజాశక్తి - బనగానపల్లె
ఆరుగాలం కష్టపడే రైతు అతివృషి,్ట అనావృష్టితో ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి పెట్టుబడులు మట్టిపాలై అన్నదాతలు అప్పులపాలయ్యారు. గ్రామాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలసలు వెళుతున్నారు. కరువుతో పశువులకు మేత లేక పాడిపోషకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు మేత లేక అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు వేసిన పంటలు వర్షాలు లేక 90 శాతం ఎండిపోయాయి. కష్టకాలంలో ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
బనగానపల్లె మండలంలో 45 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఖరీప్‌లో 24,250 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో ఇప్పటివరకు 10,250 ఎకరాల్లో మాత్రమే పంటలను సాగు చేశారు. మండలంలోని కటికవానికుంట, ఫతేనగరం పసుపుల, పెద్దరాజు పాలెం, చిన్నరాజుపాలెం, క్రిష్ణగిరి, చెర్లో కొత్తూరు, జోలాపురం, పాతపాడు, మీరాపురం, యాగంటిపల్లె, యనకండ్ల ఎర్రగుడి, హుస్సేనాపురం, రామ కృష్ణాపురం, రాళ్లకొత్తూరు తదితర గ్రామాలలో ఖరీఫ్‌లో కంది 3769 ఎకరాలు, కొర్ర 375, పత్తి 603, మినుము 104, మొక్కజొన్న 5101, వరి 379, మిరప 2336, ఇతర పంటలు 300 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. రబీలో మొక్కజొన్న 1800 ఎకరాలు, జొన్న 7035, మినుము 1000, శనగ 3000, పొగాకు 200, ఇతర పంటలు 100 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 65.3 మి.మీకు గాను 42.8 మి.మీ, జూలైలో 106.3 మి.మీకు గాను 99.4 మి.మీ, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా లోటు వర్షపాతమే నమోదయింది. తీవ్ర వర్షాభావంతో పంటలన్నీ ఎండిపోయాయి. అధిక వడ్డీలకు లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే ఎండిపోయి పెట్టుబడి మట్టి పాలు కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. బోర్లు, బావుల కింద రైతులు మొక్కజొన్న, పత్తి , మిరప, వరి పంటలను సాగు చేస్తే భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు వేసిన పంటలు కొన్ని గ్రామాలలో ఎండిపోయాయి. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోవడం, బోర్లలో భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోపక్క ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పంటలు చేతికందకుండా పోయాయి. ప్రభుత్వం బనగానపల్లె మండలాన్ని కరువుగా ప్రకటించినా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో కూలీలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి 50 వేల రూపాయలు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉన్న ఊళ్లో పనులు కరువై వలసలు..
మండలంలో రైతులు వేసిన పంటలు ఎండిపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు కరువయ్యాయి. ఉన్న ఊళ్లో పనులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు ప్రాంతాలకు ఆటోలలో ప్రతిరోజూ వందలాదిమంది పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం పనికి ఆహార పథకం పనులను ప్రారంభించి ఆదుకోవాలని రైతులు, రైతు కూలీలు కోరుతున్నారు.
పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం
- యామా చిన్న పుల్లారెడ్డి రైతు యాగంటి పల్లె
వర్షాలు సక్రమంగా పడక వేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. లక్షల రూపాయలు అప్పులు చేసి ఐదు ఎకరాలలో కంది, నాలుగు ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎండిపోయాయి. అప్పుల పాలయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
పంట నష్టపరిహారం చెల్లించాలి 180
- ఈశ్వర్ నాయక్, రైతు, చిన్న రాజుపాలెం తండా.
తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయాయి. ఎకరానికి రూ.50,000 పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.