Nov 22,2022 00:03

శిక్షణలో మాట్లాడుతున్న వ్యవసాయ శాస్త్రవేత్త లలిత కామేశ్వరి

ప్రజాశక్తి - రంపచోడవరం
పంటలలో సకశేరుకాలు యాజమాన్యంపై ప్రదర్శన, శిక్షణ కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన మండలంలోని పందిరిమామిడిలో సోమవారం ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారతీయ సకశేరుకాల చీడ పీడల యాజమాన్య సంస్థ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ఆచార్య ఎన్‌జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యా లయం సహకారంతో కోతులు, అడవి పందులు, కుందేళ్ళు, ఎలుకలు, పక్షులు వంటి సకశేరుకాల యాజ మాన్యంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.లలిత కామేశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలో రైతులు పండిచే అన్ని పంటలను కోతులు నాశనం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్న నేపథ్యంలో కోతుల యాజమాన్యానికి సమీష్ట కృషి చేయాలని సూచించారు. మంకీ గన్ను అగ్రి కేనన్‌ వాడకం ద్వారా కోతులను భయపెట్టి దూరంగా తరమడం, అడవి పంది వేషం వేసి భయ పెట్టడం, లేజర్‌ లైట్లు, అడ్డు తెరలు, సోలార్‌ కంచెలు వాడటం వంటివి చేయాలని సూచించారు. అడవి పందులు, కుందేళ్ళు, ఎలుకలు, పక్షులు పంటలకు నష్టం కలగజేసే విధానాన్ని, యాజమాన్యాన్ని సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తెగుళ్లు విభాగం శాస్త్రవేత్త ఎన్‌.చిరంజీవి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేతలు ఆర్‌.ప్రవీణ్‌ బాబు, టి.క్రాంతి కుమార్‌, కె.వీరంజనేయులు, కె.లక్ష్మణరావు, మండల వ్యవసాయాధికారులు జెన్నీ, పి.వెంకటేశ్వర్లు, ఎన్‌.రమేష్‌, ఉద్యానశాఖ అధికారి, గొర్లె బాలాజీ, అభ్యుదయ రైతులు బాబ్జీ, అబ్బులు, కె.శివాజీ, రైతులు పాల్గొన్నారు.