ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రైతులు పండించిన అన్ని పంటలకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. నగరంలోని క్రాంతి భవన్‌లో కమిటీ కన్వీనర్ తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, రైతు సంఘం జిల్లా నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, కౌలురైతు సంఘం నాయకులు పోలాకి ప్రసాదరావు, ఎఐకెకెఎంఎస్ నాయకులు సురేష్ కుమార్ మాట్లాడుతూ రైతాంగానికి తీవ్రమైన హాని కలిగించే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్ బిల్లు-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంటలన్నింటికీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి ధర నిర్ణయించాలన్నారు. ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని, 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర నిర్ణయించి ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 500కు పైగా రైతుసంఘాలతో ఏర్పడ్డ సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రెండో దశ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి పైగా సాగించిన పోరాటంతో ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తానని, రైతులతో చర్చించిన తర్వాతే ఎలక్ట్రిసిటీ బిల్లును ప్రవేశపెడతామని హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు హామీలను అమలు చేయకపోగా, పార్లమెంటులో విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. రైతాంగం మెడలకు ఉరితాడు కాగల ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ల బిగింపును వేగవంతం చేస్తున్నారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రైతాంగ డిమాండ్లను సాధించుకునేందుకు తిరిగి పోరాటం కొనసాగించాలన్నారు. కేరళ తరహా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలన్నారు. ఈనెల 30న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.చందర్రావు, జి.శ్రీరామ్మూర్తి, టి.నందోడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










