* ఈ-క్రాప్‌లో కొత్త విధానం
* బుకింగ్‌కు రైతు అందుబాటులో ఉండాల్సిందే
* రోజుకు ఆరు ఎకరాలు నమోదు
* వలస రైతులకు తప్పని ఇబ్బందులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఖరీఫ్ సాగు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు అధికారులు ఈ-క్రాప్ నమోదుకు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పంటల కొనుగోలు, వరదలు, తుపాన్ల సమయంలో ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాల వర్తింపునకు ఈ-క్రాప్ తప్పనిసరి అని అధికారులు చెప్తున్నారు. మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకొచ్చింది. గతంలో రైతు సాగు చేసిన పంటకు మాత్రమే ఫొటో అప్‌లోడ్ చేయగా, కొత్త విధానంలో పొలంలో రైతు ఉంటుండగా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పద్ధతిలో రైతులతో పాటు అగ్రికల్చర్ అసిస్టెంట్లు (విఎఎ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకు (విహెచ్‌ఎ) ఇబ్బందిగా పరిణమించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 2,05,758 ఎకరాల్లో పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 1,80,458 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న పంట సాగు లక్ష్యం 26,375 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 16,163 ఎకరాల్లో వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల్లో వేయాలని నిర్ణయించగా, 1085 ఎకరాల్లో సాగవుతోంది. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 2,210 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కందులు 73 ఎకరాలు, వేరుశనగ 1333 ఎకరాల్లో సాగవుతోంది. పంటల సాగు ప్రారంభించి రెండు నెలలు కావడంతో, అధికారులు ఈ-క్రాప్‌కు నమోదు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన విధానానికి అనుగుణంగా అధికారులు ఈ-క్రాప్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి పంటకూ జియోట్యాగింగ్ చేయాల్సిందేనని నిబంధన తెచ్చింది.
అవకతవకలకు చెక్ చెప్పేందుకేనా?
ఒక విఎఎ రోజుకు ఆరు ఎకరాల వరకు జియోట్యాగింగ్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో తమపై తీవ్ర పనిభారం పడుతోందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి సర్వే నంబరుకు, అదేవిధంగా ఆయా సర్వే నంబర్లలోని సబ్ డివిజన్లకు వెళ్లి జియోట్యాగింగ్ ద్వారా ఈ-క్రాప్ నమోదు చేస్తున్నారు. గతంలో కార్యాలయాల్లో కూర్చొని రైతులు తీసుకొచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు, వన్-బి ద్వారా పంట నమోదు చేసే పరిస్థితి ఉండేది. సిగల్ లేని చోట, కొండల పైకి వెళ్లలేని సందర్భంలో రైతులు అందించే వివరాలతో ఈ-క్రాప్ చేసే వెసులుబాటు ఉండేది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో సాగు చేయని పంటలకూ ఈ-క్రాప్ చేయించడం, ఒక పంట వేస్తే మరో పంట నమోదు చేయడం వంటి అవకతవకలు చోటుచేసుకునేవి. పంట వేయకపోయినా ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు దక్కించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్షేత్రస్థాయికి వెళ్తే గానీ పని జరిగే అవకాశం లేదు. పొలాలకు వెళ్లి పంట వివరాలు, రైతు ఫొటోలను తీసి అప్‌లోడ్ చేస్తే గానీ జియోట్యాగింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో విఎఎలు, విహెచ్‌ఎలు కొంత పనిఒత్తిడికి లోనవుతున్నారు.
యాప్‌లో లోపాలతో సమస్యలు
పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంతా ఒకేసారి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నట్లు సిబ్బంది చెప్తున్నారు. పైగా కొన్నిచోట్ల సిగల్స్ లేకపోవడంతో అప్‌లోడ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాప్‌లో లోపాలతో జియోట్యాగింగ్ సరిగా జరగడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
రైతులకూ పాట్లే
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో అటు రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. భూములను కౌలుకు ఇచ్చి వలస వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో వారు రాకుండానే పంట ఈ-క్రాప్‌లో నమోదయ్యే పరిస్థితి ఉండేది. జియోట్యాగింగ్ పద్ధతిలో వారు తప్పనిసరిగా రావాల్సి వస్తోంది. పంటను ఏదో విధంగా అమ్ముకుందామనుకున్నా, ఈ-క్రాప్ చేయించకపోతే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు సొంత గ్రామాలకు వస్తున్నారు. భూమిని కౌలుకి ఇచ్చిన వారు మాత్రం రావడానికి ఇష్టపడడం లేదు.
జియోట్యాగింగ్ తప్పనిసరి
పంటల కొనుగోలు, ఇతర ప్రయోజనాలన్నీ నిజంగా సాగు చేస్తున్న రైతులకే దక్కాలనే ప్రభుత్వం జియోట్యాగింగ్ విధానం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం పంటతో పాటు పొలంలో రైతు ఉన్నట్లు ఫొటో తీసి జియోట్యాగింగ్ చేస్తున్నాం. రైతులంతా తప్పనిసరిగా ఈ-క్రాప్ చేయించుకోవాలి.
- కె.శ్రీధర్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు










